Deputy CM Pawan Kalyan: ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. తిరుమల మహా ప్రసాదం అయిన లడ్డూ తయారీలో కల్లీ నెయ్యి వినియోగంపై పవన్ కళ్యాణ్ ఈ ఆవేదన నిమిత్తం ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాయశ్చిత్త నిమిత్తం అంతా నారాయణ మంత్రం పఠిస్తున్నారు. అలా నారాయణ మంత్రం పఠించే వారందరి కోసం సంగీత దర్శకుడు కీరవాణి ఓ ఆడియో రికార్డ్ చేశారు. ఆడియో రికార్డ్ చేసిన కీరవాణికి, ఆయన టీమ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు.
అందులో.. ’ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని ప్రజానీకం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరికీ తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాను.
ఈ దీక్షకు సంఫీుభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో పాటు ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారు. అందుకు అనువుగా కీరవాణి ఆడియో రికార్డు చేశారు. భక్తి భావంతో సాగింది. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షిత:‘ అని పేర్కొన్నారు.