ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలకమైన అప్డేట్ వచ్చింది. 2026 ఏడాది పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఏపీ ఇంటర్ బోర్డు కొన్ని పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌లో హోలీ, రంజాన్ పండగలు పరీక్షల రోజులతో ఒకే తేదీన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా టైం టేబుల్‌ను సవరించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా స్పష్టం చేశారు.
ఇంటర్ సెకండ్ ఇయర్‌కు సంబంధించిన మ్యాథ్స్ పేపర్ 2ఏ, సివిక్స్ పేపర్ 2 పరీక్షలు ముందుగా మార్చి 3న నిర్వహించాల్సి ఉండగా, ఆ రోజు హోలీ పండగ కావడంతో వాటిని మార్చి 4కు మార్చారు. అలాగే ఫస్ట్ ఇయర్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పరీక్షలు మార్చి 20న జరగాల్సి ఉండగా, ఆ రోజు రంజాన్ సెలవు ఉండటంతో ఈ పరీక్షలను మార్చి 21వ తేదీకి మార్చారు. మిగతా అన్ని పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
ఇక ఫస్ట్ ఇయర్ సిలబస్‌లో మార్పులు చేసిన నేపథ్యంలో బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించారు. నైతికత, మానవ విలువల పరీక్షలను జనవరి 21న, పర్యావరణ పరీక్షను జనవరి 23న నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ విషయానికి వస్తే, జనరల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు రెండు విడతలుగా నిర్వహిస్తారు.
ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23న లాంగ్వేజ్ పేపర్‌తో ప్రారంభమై, మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ లేదా జియోగ్రఫీ పరీక్షతో ముగుస్తాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై, మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా లాజిక్ పరీక్షతో ముగియనున్నాయి. మారిన తేదీలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండగల కారణంగా పరీక్షలు వాయిదా పడటం వల్ల విద్యార్థులకు కొంత ఊరట లభించిందని, అయితే చివరి నిమిషంలో గందరగోళం లేకుండా తాజా టైం టేబుల్‌ను తప్పకుండా పరిశీలించాలని ఇంటర్ బోర్డు సూచించింది.
ఏపీ ఇంటర్ 1st ఇయర్ పరీక్షల కొత్త టైం టేబుల్..
ఫిబ్రవరి 23న లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష, ఫిబ్రవరి 25న ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష, ఫిబ్రవరి 27న హిస్టరీ పేపర్ 1 పరీక్ష, మార్చి 2న మ్యాథ్స్ పేపర్ 1 పరీక్ష, మార్చి 5న జూలాజీ / మ్యాథ్స్ 1బి పరీక్ష, మార్చి 7న ఎకనామిక్స్ 1 పరీక్ష, మార్చి 10న ఫిజిక్స్ 1 పరీక్ష, మార్చి 12న కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1 పరీక్ష, మార్చి 14న సివిక్స్ 1, పరీక్ష, మార్చి 17న కెమిస్ట్రీ 1 పరీక్ష, మార్చి 21న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1 పరీక్ష (పరీక్ష తేదీ మారింది), మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 1 పరీక్ష,
ఏపీ ఇంటర్ 2nd ఇయర్ పరీక్షల కొత్త టైం టేబుల్..
ఫిబ్రవరి 24న లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష, ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష, ఫిబ్రవరి 28న హిస్టరీ / బోటనీ పేపర్ 2 పరీక్ష, మార్చి 4న మ్యాథ్స్ పేపర్ 2 ఎ / సివిక్స్ 2 పరీక్ష (పరీక్ష తేదీ మారింది), మార్చి 6న జూలాజీ 2 / ఎకనామిక్స్ 2 పరీక్ష, మార్చి 9న మ్యాథ్స్ పేపర్ 2 బి పరీక్ష, మార్చి 11న ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2 పరీక్ష, మార్చి 13న ఫిజిక్స్ 2 పరీక్ష, మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 2 పరీక్ష, మార్చి 18న కెమిస్ట్రీ 2 పరీక్ష, మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2 పరీక్ష.
