పుచ్చకాయ ఓకే..! వాటి గింజలు కూడా మేలు చేస్తాయా..?

వేసవిలో ఎక్కువగా తినేది పుచ్చకాయ. మండే ఎండల్లో శరీరానికి చల్లదనం, విటమిన్లు, బలాన్ని ఇస్తుంది. పుచ్చకాయల్లో 25 రకాలు ఉన్నాయి. వేసవిలో వీటిని తినడం, జ్యూస్ చేసుకుని తాగడం చేస్తాం. అయితే.. పుచ్చకాయలో గింజలు ఎక్కువ. వాటిని తీసుకుని తినడంలో కానీ.. తినేటప్పుడు నోట్లో ఉన్న గింజలను తొలగిస్తూ తినడం కానీ పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఒక్కోసారి అవి పొట్టలోకి వెళ్లిపోతాయి.. లేదా తినేస్తారు కూడా. అయితే.. దీనివల్ల ఏమైనా ఇబ్బందేమోననే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే.. ఇదేం ప్రమాదం కాదంటున్నారు వైద్యులు.

పుచ్చకాయ గింజలు మన ఆరోగ్యాన్ని పెంచుతాయనే అంటున్నారు. గింజలు పొట్టలోకి వెళ్తే మొక్కలు మొలుస్తాయనే అపోహ కూడా సరైంది కాదంటున్నారు వైద్యులు. ఇంకా.. పొట్టలోకి వెథ్తే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండెకు మేలు చేస్తాయి. గింజల్ని కొన్ని పద్ధతుల ద్వారా తినొచ్చని కూడా అంటున్నారు. పుచ్చకాయ గింజల్ని వేరుచేసి ఎండబెట్టాలి. చిన్నగా వేపాలి. అనంతరం వాటిని గాలి ఆడకుండా సీసాలో పెట్టాలి. వాటిని స్నాక్స్ గా తినొచ్చు.. సలాడ్స్ లో చల్లుకోవచ్చు.. పొడిలా చేసి కూరల్లో వాడుకోవచ్చు.

వీటిలో ఉండే గ్లోబులిన్, అల్బుమిన్ అనే ప్రోటీన్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గింజల్లోని మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ సీ, బీ కాంప్లెక్స్, అమైనా యాసిడ్స్ శరీరానికి మేలు చేస్తాయి. హైబీపీ ఉన్నవారు పుచ్చకాయలు తింటే మంచిది. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. వారు పుచ్చకాయ గింజలు తింటే ఎంతో ఆరోగ్యం కూడా. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతుంటాయి. వారు ఈ గింజలు తింటే అంతా సర్దుకుంటుంది.

పుచ్చకాయ గింజల్లో ఉండే L-ఆర్గినిన్ అనే అమైనా యాసిడ్ వల్ల నైట్రిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి శరీరంపై ఏమైనా చిన్న చిన్న గాయాలుంటే త్వరగా తగ్గేలా చేస్తుంది. పుచ్చకాయ గింజల్లో ఉండే మెగ్నీషియం, జింక్ జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా.. జుట్టు బలంగా ఉండేట్టు చేస్తుంది. ఇలా పుచ్చకాయల గింజల వల్ల ప్రయోజనాలే కానీ.. చెడు ప్రభావం ఉండదు. ఈ ప్రయోజనాలు తెలీకపోయినా వేసవిలో మన ఫేవరెట్ ఫ్రూట్ పుచ్చకాయ. అది ఇచ్చే చల్లదనం, కిక్కే వేరు కాబట్టి పుచ్చకాయను హ్యపీగా తినేయచ్చు.

 

గమనిక: ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆహార నిపుణులు ఆయా సందర్భాల్లో అందించిన వివరాలనే తెలియపరిచాం. ఆహార సలహాలు, ఆరోగ్య వివరాలపై ఏమైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అర్హత ఉన్న ఆహార నిపుణులు, వైద్యుల సలహాలకు ఈ కథనం ప్రత్యామ్నాయం కాదు. గమనించగలరు.