ఉపవాసం అంటే చాలామంది మతపరమైన ఆచారంగా మాత్రమే భావిస్తారు. కానీ శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం వారానికి ఒక రోజు ఉపవాసం చేస్తే శరీరానికి అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతిలోని ఒక భాగం. 24 గంటల ఉపవాసం శరీరానికి రీసెట్ బటన్ లాంటిదని నిపుణులు చెబుతున్నారు. సరైన విధంగా చేస్తే ఇది ఆరోగ్యానికి ఒక పవర్‌ఫుల్ బూస్ట్‌గా మారుతుందని అంటున్నారు.
ఉపవాసం సమయంలో శరీరం కొత్త శక్తిని సృష్టించుకోవడానికి నిల్వలో ఉన్న కొవ్వును వాడుకుంటుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా, పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. జీర్ణవ్యవస్థకు ఇది ఒక విశ్రాంతిని ఇస్తుంది. నిరంతరం పనిచేసే పేగులు ఒకరోజు రిలాక్స్ అయ్యి మరుసటి రోజు మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. మలబద్ధకం, కడుపు సమస్యలు తగ్గిపోతాయి.
ఇక ఉపవాసం న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచి మెదడు పనితీరును శక్తివంతం చేస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. కొన్ని అధ్యయనాలు ఉపవాసం ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. అలాగే ఉపవాసం వల్ల ఆటోఫాజీ అనే ప్రక్రియ జరుగుతుంది. దీని అర్థం కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను శుభ్రం చేసుకోవడం. ఇది వృద్ధాప్యాన్ని ఆలస్యంగా తెస్తుంది. కణాలు ఆరోగ్యంగా ఉండటం వల్ల దీర్ఘాయుష్షు పొందే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు, ఉపవాసం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు సంతులనం అవుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఉపవాసం చేస్తే లాభాలు ఉన్నాయి అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు. ఉపవాస సమయంలో నీరు పుష్కలంగా తాగాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం (చక్కెర లేకుండా) తీసుకోవచ్చు. ఉపవాసం ముగిసిన తర్వాత తేలికైన ఆహారం పండ్లు, కూరగాయలు, సూప్‌లు మాత్రమే తీసుకోవాలి. భారీగా తినడం వల్ల కడుపు నొప్పి రావచ్చు. ముఖ్యంగా, మీకు ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.
శరీరానికి రీసెట్, మనసుకు రిలీఫ్, ఆరోగ్యానికి గిఫ్ట్‌లా ఉండే ఈ ఉపవాసం అలవాటు వారానికి ఒక్కరోజు చేసుకోవడం వల్ల జీవనశైలి మొత్తం మారిపోతుంది. చిన్న మార్పు పెద్ద ఫలితాలను ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
