ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై అప్పట్లో వచ్చిన విమర్శలు, ప్రజా విన్నపాలు, అధికారుల నివేదికలతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన ఆందోళనలు ఇలా అన్నీ కలిపి ఇప్పుడు జిల్లా పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది.
2022లో జగన్ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా 13 జిల్లాలను 26గా పునర్విభజించింది. అయితే ఆ విభజనలో పలు లోపాలు ఉన్నాయని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాలను అనవసరంగా విడగొట్టడం.. మండలాలను అశాస్త్రీయంగా కలపడం వల్ల పరిపాలనాపరంగా సమస్యలు ఏర్పడ్డాయని స్థానికులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు, అధికారంలోకి వస్తే మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాల పేర్లు, సరిహద్దులు, డివిజన్లు, మండలాల పరిమితులు మార్చాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు వచ్చాయి. కలెక్టర్లు, సీనియర్ అధికారులు కూడా పలు సూచనలు చేస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కీలకంగా అధ్యయనం జరగనుంది. నగరి నియోజకవర్గంలోని మండలాల విభజన, పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరులో కలపడం, చంద్రగిరిని తిరుపతిలో కలపడం వంటి నిర్ణయాలపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకతలు అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా వెదురు కుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని స్థానికులు చేసిన ఆందోళనలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి.
ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారం.. చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు, నగరి నియోజకవర్గాలను వేరుచేసే అవకాశం ఉంది. చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమ నేరు, కుప్పం నియోజకవర్గాలతో కొత్త చిత్తూరు జిల్లా ఏర్పాటు కానుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి నియోజకవర్గాలతో తిరుపతి లేదా బాలాజీ జిల్లా రూపుదిద్దుకోనుంది. మదనపల్లిని కేంద్రంగా తీసుకుని మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో ప్రత్యేక మదనపల్లి జిల్లా ఏర్పడే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తీసుకోబోయే తుది నిర్ణయం ఏదో అన్నది ఆశక్తిగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది.
