మనలో చాలా మందికి బాదం తినడం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. తెల్లవారగానే నానబెట్టిన బాదం గింజలు తినడం ఒక పాత అలవాటు. కానీ తాజాగా జరిగిన ఒక పరిశోధన మాత్రం ఆశ్చర్యపరిచే విషయాన్ని వెల్లడించింది. రోజుకు 4–5 బాదాలకు మాత్రమే పరిమితం కాకుండా, 40–50 బాదం గింజలు (సుమారు 60 గ్రాములు) తీసుకుంటే DNA నష్టం నుంచి కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం.. బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే “ఆక్సీకరణ ఒత్తిడిని” (Oxidative Stress) తగ్గిస్తాయి. ఈ ఒత్తిడి అధికమైతే కణాలు దెబ్బతిని క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు, అకాల వృద్ధాప్యానికి కూడా ఇది కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
400 మందిపై జరిపిన ఈ పరిశోధనలో, రోజూ 60 గ్రాముల బాదం తిన్నవారిలో DNA నష్టం సూచికలు గణనీయంగా తగ్గాయని తేలింది. ముఖ్యంగా 8-OHdG అనే DNA నష్ట సూచిక స్థాయిలు పడిపోయాయి. కణాలకు హానికరమైన MDA అనే పదార్థం కూడా తగ్గింది. అంతేకాకుండా, శరీర రక్షణలో కీలకమైన SOD యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ పనితీరు గణనీయంగా పెరిగింది.
అయితే శాస్త్రవేత్తలే ఒక జాగ్రత్తను సూచిస్తున్నారు. రోజుకు 60 గ్రాముల బాదం అంటే దాదాపు 400 కేలరీలు. ఎక్కువ రోజులు ఇంత మోతాదులో తింటే బరువు పెరగడం, గ్యాస్, కడుపు నొప్పి, కిడ్నీ సమస్యలు రావచ్చని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. బాదం అలెర్జీ ఉన్నవారికి ఇది ప్రమాదకరం కూడా. కాబట్టి ఎవరైనా ఎక్కువ మోతాదులో బాదం తీసుకోవాలనుకుంటే, డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి బాదం శక్తివంతమైన మూలము. ఇందులో ప్రోటీన్, విటమిన్ E, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు చర్మ కాంతిని పెంచడంలో, జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా బాదం గొప్ప పాత్ర పోషిస్తుంది. అందువల్ల బాదం చెల్లా చెదురుగా తినే ఒక స్నాక్ కాదు. సరైన మోతాదులో తీసుకుంటే ఇది శరీరాన్ని లోతుగా సంరక్షించే ఒక సహజ ‘శక్తి కవచం’ లాంటిదని చెప్పవచ్చు.
