మీ శరీరంలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.. వైద్యుల్ని సంప్రదించి ఈ టెస్ట్ చేయించుకోండి?

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య షుగర్ వ్యాధి . దీన్ని మొదట్లోనే గుర్తించగలిగితే కొంతవరకు అదుపు చేయవచ్చు. అయితే షుగర్ వ్యాధి లేని వాళ్లకు కూడా ఎప్పుడు షుగర్ వస్తుందో అన్న భయం ఉండటం సహజ.అందుకే షుగర్ వ్యాధి లక్షణాలు, ఈ ప్రమాదకర వ్యాధినీ ఎలా నియంత్రించాలి అన్న సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మనం పౌష్టికాహారం తీసుకున్నప్పటికీ తరచూ నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తుంటే షుగర్ వ్యాధిగా అనుమానించొచ్చు. బరువు అతిగా పెరుగుతున్న, తొందరగా తగ్గిపోతున్న, కీళ్ల నొప్పులు, నీళ్లు ఎక్కువగా తాగుతున్నప్పటికీ దప్పిక వేయడం గొంతు ఆరిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నప్పుడు, చిన్నపాటి గాయం మానటానికి ఎక్కువ సమయం తీసుకున్న, కంటి చూపు తగ్గడం, దంతాలు ఊడిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తప్పనిసరిగా షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

షుగర్ వ్యాధి రావడానికి కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. అంటే శరీరంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగినప్పుడు దానిని కంట్రోల్ చేసే సామర్ధ్యం శరీరానికి లేనప్పుడు షుగర్ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు బ్లడ్ సుగర్ లెవెల్స్ రెగ్యులర్ గా చెక్ చేసుకోవటం చాలా అవసరం.

ఒక్కొక్కసారి షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. చాలామందిలో మాత్రం మన రోజువారి ఆహారపు అలవాట్లు, వృత్తిరీత్యా ఎక్కువగా కూర్చుని పనిచేయడం వల్ల శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో షుగర్ వ్యాధి వస్తుందని అనేక సర్వేల్లో వెల్లడైంది. కావున సంపాదన మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా కొంత శ్రద్ధ పాటించాలి. ప్రతిరోజు కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం నడక రన్నింగ్ యోగాసనాలు వంటివి అలవాటు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్న జంక్ ఫుడ్ ను తీసుకోవడం తప్పనిసరిగా తగ్గించాల్సిందే.