మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిరోజు సంపూర్ణ పోషకాహారాన్ని తీసుకున్నట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అయితే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో మైదా ఉత్పత్తులు, జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్స్ వంటివి అధికంగా ఉంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. దాంతో మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అనేక రకాల వ్యాధులకు ప్రథమ కారణం ఈ మలబద్ధక సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు మలబద్దకం అంటే ఏమిటి? ఈ సమస్యకు కారణాలు ఏంటి. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం.
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలోని పోషక విలువలను మన శరీరం గ్రహించిన తర్వాత మిగిలిన వ్యర్ధాలన్నీ మలవిసర్జన ద్వారా బయటికి వెళ్లడం సర్వసాధారణం. ప్రతిరోజు రెండుసార్లు మలవిసర్జనలు చేస్తేనే ఆరోగ్యవంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. అలాకాకుండా మలవిసర్జన సులువుగా కాకుండా మలద్వారం దగ్గర తీవ్రమైన నొప్పి రక్తం కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటే దాన్ని మలబద్ధక సమస్య అంటారు. ఇది దీర్ఘకాలం పాటు వేధిస్తే తీవ్రమైన వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.
తీవ్రమైన తలనొప్పి, నడుము నొప్పి ,గుండెల్లో పట్టుకోవడం, వాంతి వికారంగా ఉండడం, ముఖంపై మొటిమలు రావడం వంటి లక్షణాలు మలబద్ధక సమస్యతో బాధపడే వారిలో కనిపిస్తాయి.
మలబద్దక సమస్యకు ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండటం, ఫైబర్ తక్కువగా ఉన్న మైదా ఉత్పత్తులను ,జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటే జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. కావున మలబద్ధక సమస్య ఏర్పడవచ్చు. అలాగే తక్కువగా నీళ్లను తాగే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. మన శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు మూత్రం మరియు మలం నుంచి నీటిని స్వీకరిస్తుంది దాంతో మలం గట్టిగా తయారై మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
మలబద్దక సమస్య నుంచి బయటపడడానికి మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల స్థాయి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఫలితంగా మల బద్ధకం సమస్య ఏర్పడకుండా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్ల జ్యూసులను తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజు రెండు గ్లాసుల పలుచని మజ్జిగ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు మన ఆహారంలో ద్రాక్ష , బొప్పాయి పండును తీసుకున్నట్లయితే మలబద్ధక సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపుతుంది. ఎక్కువ కూర్చుని పని చేసేవారు రెండు గంటలకు ఒకసారి లేచి అటు ఇటు తిరగడం మంచిది. సమస్య మరి తీవ్రంగా ఉంటే డాక్టర్లను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమం.