ఎన్నిసార్లని ఓడిస్తారు, ఈ సారి తప్పక గెలిపిస్తారు

యాంటి ఇంకంబెన్సీ అనే మాట విన్నాం. ఎక్కువ కాలం పవర్లో ఉంటే, చెప్పినవ్నీ చేయలేక, చేసినవి చాలక, చేయాల్సినవి తీరక ప్రజల్లో విరక్తి ఎదురయితే దాని ప్రభుత్వ వ్యతిరేకత లేదా యాంటి ఇంకంబెన్సీ అంటారు. మరీ చాలా సార్లు ఓడిపోయి, పోటీ చేసిన ప్రతిసారీ పరాభావం పాలయి, ప్రజల్లో ‘అయ్యే పాపం’ అనే సానుభూతి వస్తే,   అది ఓట్లు రాలుస్తుందా. సానుభూతి సునామిలాగా వచ్చి, ‘ ఆచారిని అలా ఎన్ని సార్లు ఓడిస్తారు, ఇక చాలు, ఈ సారి గెలిపిస్తాం,’ అని ప్రజలు ముందుకువస్తారా… మరి దీన్నేమంటారు? ఇలాంటి సానుభూతి వెల్లువ ఈ సారి తనని గెలిపిస్తుందని ఫీలవుతున్నారు కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి. ఆయన పోయినతూరి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీ చంద్ రెడ్డి (42,229) చేతిలో ఓడిపోయారు. ఆచారికి ఇది (42,197)ఘోరా పరాజయమేమీ కాదు, తేడా కేవలం 78 ఓట్లు మాత్రమే. అందువల్ల ఈసారి గెలుపు నాదే అంటున్నారు ఆచారి. ఆపుడు టిఆర్ ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ (29,687)మూడో స్థానంలో ఉన్నారు. త్రిముఖ పోటీలో బిజెపి రెండో స్థానంలో ఉండటం గమనించాల్సిన విషయం. అందునా కూడా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న 2014లో పరిస్థితి ఇది. ఇపుడు ఇదే ముగ్గురు అభ్యర్థులు మళ్లీ తలపడుతున్నారు. ఈ సారి బిజెపి బలపడిందని, మోదీ ప్రభావం ఉంటుందని కూడా ఆచారి నమ్ముతున్నారు.

డాక్టర్ వంశీ చంద్రా రెడ్డి, కాంగ్రెస్ , ఎమ్మెల్యే

గెలుపు మీద అందరికంటే గెలుపు మీద ధీమా గా ఉన్న వ్యక్తి తల్లో జు అచారి యే. ఆయన ధీమాకు కారణం వరుస పరాజయాలే. పరాజయాలే  గెలుపునకు సోపానమంటున్నారు ఆచారి.

నియోజకవర్గంలో చాలా సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండు సార్లు రెండో స్థానంలో ఉన్నారు. ఆమనగల్ పంచాయతీ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆచారి మహబూబ్ నగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడిగాపని చేశారు. 1999,2004,2009,2014 ఎన్నికల్లో నిలబడ్డారు. 2004,2014లలో రెండో స్థానంలో నిలబడ్డారు. పలుసార్లు ఓడిపోవడం, రెండుసార్లు విజయానికి చేరువగా రావడంతో ప్రజల్లో బాగా గుర్తింపు వచ్చిందని, ఈ సారి ప్రజలను సానుభూతితో ఓటేసి గెలిపిస్తారని ఆయన బాగా నమ్ముతున్నారు.

ఆయన ధీమాకు మరొక కారణం, రూలింగ్ టిఆర్ ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ ఏ మాత్రం ఫామ్ లో లేకపోవడం. టిఆర్ ఎస్ లో బాగా గొడవలున్నాయి. అందువల్ల జైపాల్ యాదవ్ గెలిచేందుకు పరిస్థితి అనుకూలంగా లేదని స్థానిక రాజకీయ పండితులు అభిప్రాయం. ఈసారి పార్టీలోని తన సహచరులైన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి , ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిల పూర్తి మద్దతు కూడగడితే కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖపోటీ ఖాయం. లేదా 2014లో లాగా బహుముఖ పోటీ. టిఆర్ ఎస్ కు ప్రమాదం.  ఐటి మంత్రి కెటి రామారావు అందరిని రాజీచేశాడని, వీరంతా యాదవ్ కి మద్దతు నిస్తున్నారని టిఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కేవలం వందల నుంచి వెయ్యి, రెండు వేల ఓట్ల మెజారిటీతోనే గట్టేక్కే అవకాశాలే కనపడుతున్నాయి.

 టీఆర్‍ఎస్‍ అభ్యర్థి జైపాల్‍ యాదవ్‍ టికెట్‍ ప్రకటించినప్పటినుంచి  ఆయనకు అసమ్మతి సెగ తగులుతూనే ఉంది. ఇక్కడి నుంచి టీఆర్‍ఎస్‍ తరపున టికెట్‍ ఆశించిన వారిలో నలుగురు వ్యక్తులు ఉండటం జైపాల్‍ యాదవ్‍కు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, గౌలి శ్రీనివాస్‍, బాలాజీసింగ్‍లు పార్టీ టికెట్‍ ఆశించారు. చివరకు పార్టీ అధినేత కేసీఆర్‍ జైపాల్‍ యాదవ్‍కు మరోసారి టికెట్‍ కేటాయించారు. దీంతో అసమ్మతి వర్గాలు గుప్పుమన్నాయి. కిష్టారెడ్డి, నారాయణ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు.వీళ్లంతా మనస్ఫూర్తిగా జైపాల్ యాదవ్ కు సహకరిస్తారా అనేది ప్రశ్న.

జైపాల్ యాదవ్ టిఆర్ ఎస్ అభ్యర్థి

వీళ్లతో టిఆర్ ఎస్ నాయకులు గౌలి శ్రీనివాస్,బాలాజీ సింగ్ లు కూడా యాదవ్ కు సహకరించాలి. అపుడు ముక్కోణపు పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో కిష్టారెడ్డి వైసిపి తరఫున పోటీ చేస్తే, నారాయణ రెడ్డి, బాలజీ సింగ్ లు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు, కిష్టారెడ్డికి 13 వేల ఓట్లు నారాయణరెడ్డికి 29 వేల ఓట్లు పోలయ్యాయి. అందువల్ల జైపాల్ యాదవ్ కు కిష్టారెడ్డి, నారాయణ రెడ్డిల మద్దతు తప్పసరిగా కావాలి. ఎందుకంటే, 2014కు ఇప్పటికి తేడా అపుడు టిడిపి రంగంలో లేదు. ఇప్పటి పరిస్థతి వేరు. టిడిపి మళ్లీ యాక్టివ్ అయింది. అది కాంగ్రెస్ కు ఉపయోపడే అవకాశం ఉంది. అయితే, పోటీ ముక్కోణంగా మారితే ఎవరికి ప్రయోజనమో చూడాలి. గతంలో పోలయిన ఓట్లను చూస్తూ ఇక్కడ బిజెపి బలంగానే ఉన్నట్లు లెక్క. బిజెపి బలంగా ఉన్నచోట ఆచారి ఎవరిఓట్లు చీలుస్తాడో చూడాలి. ఆయన కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు తీసుకుంటే నష్టపోయేది టిఆర్ ఎస్. ఒక వేళ టిఆర్ ఎస్ వ్యతిరేక ఓట్లను బిజెపి, కాంగ్రెస్ పంచుకుంటే పోటీ వారిద్దరి మధ్యే ఉంటుంది. మొత్తానికి కల్వకుర్తి ఎన్నిక ఈ సారి కూడా ఆసక్తి కరంగానే ఉంటుంది. ఎవరు గెలిచినా వందల్లోనే మెజారిటీ ఉంటుందని ఇక్కడి ప్రజలంటున్నారు. విశేషమేమిటంటే పదే పదే ఓడిపోయాడని కొంతమంది ప్రజల్లో ఆచారి మీద నిజంగా సానుభూతి ఉంది. అది ఓట్లుగా మారిపోతుందా అనేది ప్రశ్న.