Telangana Politics: ప్రతిపక్షాల వైఫల్యమే రేవంత్ రెడ్డి సర్కార్‌కు వరంగా మారిందా..?

Telangana Politics

తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించే పార్టీలు కరువయ్యాయా..? వరుస సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే లేరా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. అయితే కొంతకాలంగా ప్రజాసమస్యలను పరిష్కరించడంలో సర్కార్ వెనకబడింది. యూరియా కొరత, బీసీ రిజర్వేషన్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు, ఫీజు రీయింబర్స్‌మెంట్, గ్రూప్-1 రిక్రూట్‌మెంట్, ఉద్యోగాల భర్తీ వంటి సమస్యలపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అయితే ప్రజల తరపు పోరాడి వారికి మద్దతుగా నిలవాల్సిన బీఆర్ఎస్, బీజేపీలు మౌనంగా ఉంటున్నాయి. రాజకీయ విమర్శలు తప్పితే ప్రజా సమస్యలపై పోరాడటం మానేశాయి.

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది. ఏ గ్రామంలో చూసినా యూరియా కోసం రైతులు పడే పాట్లు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. రేయింబవళ్లు క్యూలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల అన్నదాతలపై పోలీసులు చేయి చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి. అయినా కానీ రైతుల తరపున గట్టిగా పోరాడి ప్రభుత్వాన్ని నిలదీయడంలో విపక్షాలు విఫలమయ్యాయి.

ఇక పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. మూడు నెలల్లో ఫిరాయింపుదాలరు విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సభాపతి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని..కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వివరణ ఇచ్చారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని పేర్కొన్నారు. ఈ వివరణను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు.

ఉప ఎన్నికలకు భయపడే ఇలాంటి వివరణలు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. కానీ గులాబీ నేతల విమర్శలను ప్రజలు అంతగా పట్టించుకోవడంలేదు. ఎందుకంటే గత పదేళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతపక్షాలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. దీంతో ఈ విషయంలో ప్రజల నుంచి గులాబీ పార్టీకి మద్దతు రాకపోవడమతే కాంగ్రెస్ సర్కార్ ప్రశాంతంగా ఉంది.

మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ప్రభుత్వానికి మరో సమస్యగా మారింది. కామారెడ్డి డిక్లరేషన్ లో రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నెరవేర్చలేకపోతున్నారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నాయి.

అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు విషయంలోనూ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. సుమారు రూ.8,000 నుండి 10,000 కోట్ల బకాయిలు కాలేజీలకు చెల్లించలేదు. దీంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్లు కాలేజీలు మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ అంశంలోనూ కాలేజీ యాజమాన్యాలకు ప్రతిపక్షాలు అండగా నిలబడటం లేదు.

అంతేకాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకల కారణంగా తెలంగాణ హైకోర్టు మెయిన్స్ రిజల్ట్స్ , జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను క్యాన్సిల్ చేసింది. 563 పోస్టులకు ప్రిలిమ్స్ పూర్తి చేసిన అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను మాన్యువల్‌గా రీ-ఎవాల్యుయేట్ చేయాలని ఆదేశించింది. దీనిపైనా నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వీటితో పాటు మరికొన్ని సమస్యలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నా కూడా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం పోరాటాలకు దూరంగా ఉంది. ఇది సీఎం రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్‌గా మారింది. పదేళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్.. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడం తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఎర్రవల్లి ఫాంహౌసలోనే ఉంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయకుండా మౌనంగా ఉంటున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల్లో ఓటమితో పాటు కాళేశ్వరం అవినీతి కేసులో కేసీఆర్ పేరు ఉండటం, విచారణకు హాజరుకావడం వంటి కారణాల దృష్యా కేసీఆర్ గట్టిగా పోరాటం చేయలేకపోతున్నారని భావిస్తున్నారు. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో విఫలమవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకత తగ్గిపోతుంది. ప్రతిపక్షాల మౌనం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.