మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు ప్రదర్శిస్తోంది. చాలాకాలం క్రితం కేసు ఇది. తెలుగుదేశం పార్టీ రాజగురువుగా, మీడియా మొగల్‌గా పిలవబడే రామోజీరావు, తనకున్న రాజకీయ పరిచయాలతో ఆ కేసులో ఇప్పటిదాకా తప్పించుకుంటూ వచ్చారన్నది వైసీపీ ఆరోపణ. వుండవల్లి అరుణ్ కుమార్ ఎంపీగా వున్నప్పుడు మొదలెట్టిన పోరాటమిది. అప్పటినుంచీ సాగుతూ సాగుతూ వస్తోంది. తాజాగా ఏపీసీఐడీ రామోజీరావుకి నోటీసులు పంపడంతో, ఈ కేసులో కొత్త వేగం కనిపిస్తోంది. విచారణకు రామోజీరావు హాజరవడం, ఆ తర్వాత ఆయన్ని అరెస్టు చేయడం.. ఇవన్నీ పక్కా.. అని కొందరు జోస్యం చెబుతున్నారు.
అసలు జరిగే పనేనా ఇది.? మీడియా తీర్పుల్ని ఈ మధ్య చాలా సందర్భాల్లో వింటున్నాం. మీడియానే జైలు శిక్షలు కూడా ఖరారు చేసేస్తోంది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉరిశిక్షల సంగతి సరే సరి. న్యాయస్థానాలున్నాయి.. అక్కడికి కేసులు వెళ్ళాక.. చాలా కథ నడుస్తుంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసునే తీసుకుంటే, నేటికీ విషయం కొలిక్కి రాలేదు. వైఎస్ వివేకా డెత్ మిస్టరీ సంగతి సరే సరి. రామోజీరావు విషయంలోనూ అదే జరగబోతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. కాకపోతే, ఏపీలో వైసీపీ అధికారంలో వుంది గనుక, అరెస్టు వరకు వైసీపీ, ఏపీ సీఐడీ ద్వారా చేయించే అవకాశమైతే లేకపోలేదన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
కానీ, రామోజీ వ్యూహాలు మామూలుగా వుండవ్. జాతీయ స్థాయిలో ఆయనకు పలుకుబడి వుంది. ఏం చేస్తారో రామోజీ ఈ కేసులో మరి.!