సాధారణంగా ఒక్కో నియోజకవర్గంలోనూ ఒక్కో నాయకుడు బలంగా ఉంటారు. అప్పటి రాజకీయాలు, జనం నాడి ప్రాతిపధికగా వారు ఎన్నికల్లో గెలుస్తుంటారు. ఒక్కోసారి వేవ్ లాంటివి వచ్చినప్పుడు కాస్త ప్రజాధారణకు వారు దూరమవుతుంటారు. వారు గెలిచినా ఓడినా పూర్తిగా ఆ నియోజకవర్గానికే పరిమితమవుతుంటారు. వారి బలం కూడా మెజారిటీగా ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితమవుతుంటుంది. ఈ విషయంలో మంత్రులుగా పనిచేసినవారు కూడా అతీతులేమీ కాదు. అయితే… డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొల్లపల్లి సూర్యారావు లెక్క వేరంటున్నారు విశ్లేషకులు.
కోనసీమ జిల్లాలో గొల్లపల్లికి ప్రత్యేక ఫ్యాన్ బెల్ట్ ఉంది. ఇక రాజోలు నియోజకవర్గంలో గొల్లపల్లికి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ అంత వేవ్ లోనూ ఆ పార్టీ అభ్యర్థి బొంతు రాజేశ్వర రావు ఓడిపోవడం అందుకు ఒక కారణం! ఎందుకంటే… ఈ ఎన్నికలో గెలిచిన రాపాక వరప్రసాద్ కి, ఓడిన గొల్లపల్లికీ ఉన్న ఓట్ల వ్యత్యాసం గరిష్టంగా 2% మాత్రమే! అవును… జనసేన కార్యకర్తలు రాజోలులో పార్టీ గెలుపుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, వారికి బీఎస్పీ కూడా తోడవ్వడంతో… 841 ఓట్ల స్వల్ప మెజారిటీతో రాపాక గట్టేక్కారు. దానికి తోడు వైసీపీ కార్యకర్తలు సైతం ఈసారి బొంతును గెలిపించుకోవాలని పంతంగా తిరిగారు. అయితే వారి కష్టానికి బొంతు స్వయంకృతాపరాధాలు అడ్డంకులుగా నిలవడంతో అక్కడ ఫ్యాన్ గాలి తిరిగలేదు!
ఆ పరిస్థితుల్లో కూడా గొల్లపల్లి తన హవా చూపించగలిగారు. రాజోలులో తనకు ఎప్పుడు ఒక బలమైన స్ట్రాంగ్ బెల్ట్ ఉందని చాటిచెప్పుకోగలిగారు. అయితే… అది గతం! ఇప్పుడు నాలుగేళ్ల పాటు రాజోలులో రాపాక పరిపాలనను చూసిన జనానికి… గొల్లపల్లి లేని లోటు పుష్కలంగా తెలుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజలను – ప్రజాసమస్యలను గాలికొదిలేసిన రాపాక వ్యవహారశైలికి తోడు.. ఆయన అవలంభిస్తున్న వైఖరులు… ప్రజలకు గొల్లపల్లిని మరింత దగ్గర చేస్తున్నాయట! ఇప్పుడు టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్నా, లేకున్నా… గొల్లపల్లి ఈసారి రాజోలులో పోటీచేయాలని పార్టీలకతీతంగా ప్రజలు కోరుకోవడం కొసమెరుపు.
ఇక ప్రస్తుతం పి.గన్నవరం లో కూడా పార్టీ బాధ్యతలు తీసుకుని, ఇంతకాలం ప్రజలకు ఆ నియోజకవర్గం ప్రజలకు కూడా అండగా ఉన్న గొల్లపల్లిని.. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అవును… అందుకు అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పై రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతున్న ప్రజల వ్యతిరేకత కారణమమా.. లేక, గొల్లపల్లిపై ఉన్న అభిమానం, ఈ నాలుగేళ్లు ప్రజలకు మరింత అందుబాటులో ఉన్న అంశం కారణమా అనేసంగతి తెలియదు కానీ… పి.గన్నవరం ప్రజలు కూడా ఇప్పుడు గొల్లపల్లి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు.
టీడీపీ – జనసేనలు పొత్తు పెట్టుకున్న పరిస్థితుల్లో.. రాజోలు విషయంలో జనసేన కార్యకర్తలు పట్టుబట్టిన పక్షంలో… గొల్లపల్లి కచ్చితంగా పి.గన్నవరం నుంచి పోటీచేయాలని, ఫలితంగా భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత తమదని పార్టీల కతీతంగా ప్రజలు చెబుతుండటం గమనార్హం. కారణం… టీడీపీ కార్యకర్తలు మాత్రమే గొల్లపల్లి గెలుపును కాంక్షిస్తే అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ… పార్టీలకు – కులమతాలకు అతీతంగా రెండు నియోజకవర్గాల్లోని సాధారణ ప్రజానికం ఇలా ఒక నాయకుడిని కోరుకోవడం నిజంగా గొప్పవిషయమే!
మరి ఈ స్థాయిలో స్థానిక వైసీపీ నేతలు రాపాక వరప్రసాద్, కొండేటి చిట్టిబాబులు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొవడం… ఈ సందర్భంలో రెండు నియోజకవర్గ ప్రజలూ గొల్లపల్లి అభ్యర్థిత్వాన్ని కోరుకోవడం… రాజకీయాల్లో అరుధుగా జరిగే సంఘటనలని చెబుతున్నారు పరిశీలకులు! దీంతో… ప్రజాభిష్టం మేరకు, పార్టీ నిర్ధేశించిన మేరకు గొల్లపల్లి సూర్యారావు ఈ సారి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరి ఈ నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యే కొండేటి, అద్దె ఎమ్మెల్యే రాపాక ల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సమాచారం ఉందా..? ఉన్నా కూడా లైట్ తీసుకున్నారా..? ఈసారి కూడా వారిద్దరికే అవకాశం ఇచ్చి వైనాట్ 173 అనాలని భావిస్తున్నారా..? అన్నది వేచి చూడాలి!! ఏది ఎలా జరిగినా “ఈసారి గొల్లపల్లే” అనే మాటలు వినిపిస్తుండటం కొసమెరుపు!