ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, జనసేన పార్టీ మీద ‘కాపు’ ముద్ర అయితే పడింది. పదే పదే వంగవీటి రంగా పేరుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం వెనుక, ఆ కాపు ఓటు బ్యాంకుని మరింత పదిలం చేసుకోవడం కోసమే.!
మరి, ఆ వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ ఏ పార్టీలో చేరతారు.? ఈ విషయమై జనసేన వర్గాల్లోనే కొంత గందరగోళం వుంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు, వంగవీటి రాధ ఆ పార్టీలో చేరారు.
కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇలా ఏ పార్టీనీ వదల్లేదు వంగవీటి రాధ. మరిప్పుడు, వంగవీటి రాధ ఏ పార్టీ వైపు చూస్తున్నటులు.? ప్రస్తుతానికైతే వంగవీటి రాధ, టీడీపీకి దగ్గరగా వెళుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం పాదయాత్ర’ సందర్భంగా, విజయవాడలో ఆయనకు ఘనస్వాగతం పలికారు వంగవీటి రాధ. లోకేష్ – రాధ కలయికపై, బెజవాడ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ, రచ్చ.. అంతా ఇంతా కాదు.
కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రంగా భేటీ అయ్యారు. ఇప్పుడేమో, ఆయన టీడీపీ వైపుకు వెళుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. రాధ విషయంలో ఎలా స్పందించాలో జనసేనకు అర్థం కావడంలేదు.
వంగవీటి రాధని తమవైపుకు తిప్పుకునేందుకు గత కొద్ది రోజులుగా బెజవాడ జనసేన నేతలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. గుడివాడ నుంచి వంగవీటి రాధతో పోటీ చేయించాలనే ప్రతిపాదనలూ జనసేనలో నడిచాయి.
అన్నట్టు, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కావొచ్చు.. మహాసేన రాజేష్ కావొచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే, జనసేన వైపు చూసిన చాలామందిని టీడీపీ, తెలివిగా తమవైపుకు తిప్పుకుంది. జనసేనతో కలిసి పోటీ చేయాలనే ఆలోచన ఓ వైపు చేస్తూనే, జనసేనకు ఇలా టీడీపీ వెన్నుపోటు పొడుస్తుండడం విశేషమే మరి.!