గత గ్రేటర్ ఎన్నికల్లో సునాయాసంగా తొంభై తొమ్మిది స్థానాలను గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకున్న టీఆరెస్ పార్టీకి ఈసారి ఆ పదవి అందని మానుపండులా తయారయింది. నగరపౌరులు ఇచ్చిన తీర్పు ఎవరికీ అనుకూలంగా లేకపోవడమే అందుకు కారణం. టీఆరెస్ పార్టీకి ఏకంగా నలభై నాలుగు స్థానాలు తగ్గిపోవడంతో ఆ పార్టీకి యాభై అయిదు స్థానాలు మాత్రమే మిగిలాయి. ఎక్స్ అఫిషియో ఓట్లను కలుపుకున్నప్పటికీ మేయర్ పదవి దక్కాలంటే ఇంకా ఎనిమిది ఓట్లు తగ్గుతాయి. ఈ పరిస్థితుల్లో టీఆరెస్ కు మేయర్ పీఠం సొంతంగా దక్కే ఛాన్స్ లేదు.
బీజేపీకి నలభై ఎనిమిది సీట్లు వచ్చాయి. అనగా టీఆరెస్ కంటే కేవలం ఏడు సీట్లు మాత్రమే తక్కువ. ఓటింగ్ శాతం కూడా 0 .25 మాత్రమే. ఇద్దరి మధ్యనా తేడా అతి స్వల్పమే. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మజ్లీస్ పార్టీ మూడోస్థానంలోకి వెళ్ళిపోయింది. బీజేపీకి కూడా సొంతంగా మేయర్ పీఠం దక్కదు. బీజేపీ కూడా మేయర్ పీఠం మాకు వద్దని ప్రకటించింది.
ఇక్కడే టీఆరెస్ ను బీజేపీ ఇరికించే వ్యూహాన్ని పన్నుతున్నది. అధిక స్థానాలు సాధించిన పార్టీగా మేయర్ పీఠం అందుకునే అవకాశం ముందుగా టీఆరెస్ పార్టీకే ఉంటుంది. టీఆరెస్ మేయర్ పదవి దక్కించుకోవాలంటే మజ్లీస్ పార్టీ సహకారం తప్పని సరి. మజ్లీస్ పార్టీకి టీఆరెస్ కు తేడా కేవలం పదకొండు స్థానాలే. అందువలన ఏకపక్షంగా ఐదేళ్లూ టీఆరెస్ పార్టీకే మేయర్ సీటును అప్పగించడానికి మజ్లీస్ అంగీకరించదు. చెరిసగకాలం పంచుకుందామని ఒత్తిడి చేస్తుంది. బీజేపీకి కావలసింది కూడా అదే. టీఆరెస్ గనుక మజ్లీస్ పార్టీతో ఒప్పందం చేసుకుని అధికారాన్ని పంచుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బంగారు పళ్లెంలో పెట్టి బీజేపీకి అప్పగించినట్లే.
మరి ఇప్పుడేం చెయ్యాలి? బీజేపీని తేలికగా తీసుకునే వీలు లేదని ఫలితాలు చాటాయి. కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయినట్లే. బీజేపీతో కలవడం అసంభవం. మజ్లీస్ తో కలిస్తే బీజేపీ చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేసినట్లే. ఈ పరిస్థితుల్లో మేయర్ పదవిని వదులుకోవడమే టీఆరెస్ కు శ్రేయస్కరం. మాకు తగినంత సంఖ్యాబలం లేదు కాబట్టి అసలు మేయర్ పదవి మాకు అక్కర్లేదు అని టీఆరెస్ ప్రకటిస్తే అప్పుడు మజ్లీస్, బీజేపీ కలిసి ఏమి చెయ్యాలో చూసుకుంటాయి. ఎవరూ ముందుకు రాకపోతే ఆరు నెలల తరువాత మళ్ళీ ఎన్నికలు జరపాల్సి వస్తుంది. అప్పటివరకూ ప్రత్యేక అధికారి పాలనలో కార్పొరేషన్ పని చేస్తుంది. ప్రత్యేక అధికారి పాలన అంటే నగర పాలక సంస్థ పరోక్షంగా ప్రభుత్వం చేతిలో ఉన్నట్లే.
ఈ విషయంలో టీఆరెస్ ఎలాంటి ముందడుగు వేస్తుందో చూడాలి.