“రాజకీయాల్లో ఉన్నప్పుడు రోజుకు మనం ఎన్ని గ్లాసులు మంచినీళ్లు తాగుతున్నాము అని కూడా ప్రజలు గమనిస్తుంటారు” అనేవారు దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారు.
“వ్యక్తుల ప్రయివేట్ బ్రతుకు వారి సొంతం
పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం” అన్నారు మహాకవి శ్రీశ్రీ ఎనభై ఏళ్ళక్రితమే.
రాజకీయాలు అనేవి ప్రజాసేవ కోసమే తప్ప ప్రజల మీద అధికారాన్ని చెలాయించడానికి కాదు. పదవులకు మనం ప్రతిష్ట తీసుకురావాలి తప్ప మనవలన పదవులకు అప్రతిష్ట రాకూడదు. గత కొన్ని దశాబ్దాలుగా అత్యున్నత మేధావులు, సంస్కారవంతులు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. అదే సమయంలో రౌడీలు, గూండాలు, నేరచరితులు, పన్నుల ఎగవేతదారులు, ప్రజాద్రోహులు అతి సులభంగా పదవులను పొందగలుగుతున్నారు. ఇది మన ప్రజాస్వామ్యంలో అతిపెద్ద లోపం.
ఆ విషయం అలా ఉంచితే రాజకీయాల్లో ఉంటూ, అధినాయకుల ప్రాపకంతో పదవులు అధిష్టించిన కొందరు చోటా నాయకులు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. జర్నలిస్టుల మీద నోరు పారేసుకుని తెలంగాణాలో మొన్న ఒక అధికారపార్టీ ఎమ్మెల్యే ఆ తరువాత క్షమాపణ కోరుకున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక కార్పొరేషన్ అధ్యక్షురాలు టోల్ గేట్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాక చెయ్యి కూడా చేసుకుని తీవ్ర విమర్శల పాలయ్యారు. ఆమె తప్పు ఉన్నదా లేదా అనేది ఇక్కడ చర్చ కాదు. ఎవరి వెర్షన్ వారు చెబుతారు. కానీ, ఒక బహిరంగ ప్రదేశంలో ఆమె ప్రవర్తించిన విధానం మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. కారులో తన తల్లి అనారోగ్యంతో ఉన్నారన్న ఆమె వాదన ఏమాత్రం నమ్మదగ్గదిగా లేదు. అనారోగ్యంతో ఉన్న తల్లిని కారులో కూర్చోబెట్టి అరగంట సేపు సిబ్బందితో వాగ్వివాదం చెయ్యడం, వారి ఆస్తులను ధ్వంసం చెయ్యడం ఎలా సమర్థిస్తాము? రోజూ అద్దెకు తీసుకుని కార్లు నడుపుకుని పొట్టపోసుకునే సామాన్యులు టోల్ గేట్ ఫీజు చెల్లిస్తారు. ఒకవేళ తనకు మినహాయింపు ఉందని భావిస్తే..దానికి వారు అంగీకరించకపోతే వారి ఫీజు చెల్లించి ఆ తరువాత సంబంధిత అధికార్లకు ఫిర్యాదు చెయ్యాలి. అంతే తప్ప సిబ్బంది మీద చెయ్యి చేసుకుంటే ఎలా?
ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తన మార్గంలో అంబులెన్స్ వాహనం వచ్చినపుడు కాన్వాయ్ ను ఆపి వాహనానికి దారి ఇవ్వడం చూశాము. మరి తనకు పదివి ఇచ్చిన ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకునైనా సంస్కారవంతంగా మెలగాలి కదా? బహిరంగ ప్రదేశాల్లో సిబ్బంది మీద, గుమాస్తాల మీద నలుగురి ముందు దుర్భాషలాడటం, కించపరచడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తుంది. తమ అహంకారం తమ పార్టీ ఇమేజ్ ను నష్టపరుస్తుందేమో అన్న స్పృహ కలిగి ఉండాలి. పదవి వచ్చినపుడు మరింత వినయంగా ప్రవర్తించాలి. ఈ మాటలు చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారికే కాదు…ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరికైనా వర్తిస్తాయి. మనం ప్రజలకు ప్రతినిధులమని, వారు ఆదరిస్తేనే మనకు పదవులు వచ్చాయనే గ్రహింపు కలిగి ప్రజలపట్ల కృతజ్ఞతాభావంతో ప్రవర్తించాలి. అహంకారం, దర్పాన్ని ప్రదర్శించే నాయకులను వారి అనుచరులు మెచ్చుకుంటారేమో కానీ, రాజకీయాలతో సంబంధం లేని పౌరులు, మేధావులు అసహ్యించుకుంటారు. వారి పతనాన్ని కోరుకుంటారు. అధికారంలో ఉన్నపుడు మదాంధతతో తోకలు కోస్తా…నాలుకలు కత్తిరిస్తా లాంటి పదప్రయోగాలు చేసిన చంద్రబాబు గతి ఏమైందో చూడండి. “తాట వలుస్తా…తిత్తి తీస్తా” లాంటి దుర్భాషలాడిన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇప్పుడు ఏమిటో ఒకసారి అవలోకనం చేసుకుంది.
రాజకీయాల్లో వినయం, విధేయత ఉన్నవారే ప్రజల మనస్సులో చిరకాలం నిలిచిపోతారు. పదవిని ఉపయోగించుకుని ప్రజలకు ఎవ్వరూ చెయ్యని సంక్షేమ పధకాలు అందించినందుకే మరణించి పుష్కరం కావస్తున్నా ఈరోజువరకు వైఎస్సార్ ను జనం తలచుకుంటున్నారు. ఉద్యోగుల వేతనాలు పెంచి గౌరవప్రదమైన జీవితాలను గడిపేందుకు తన ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకున్నందుకే జలగం వెంగళ రావు ఇంకా ప్రజల గుండెల్లో జీవించి ఉన్నారు.
చివరి మాటగా చెప్పాలంటే రాజకీయం అనేది డయాబిటీస్ లాంటిది. డయాబిటీస్ వచ్చినవారికి జిలెబీలు, జాంగ్రీలు, మైసూర్ పాక్, కాజాలు తినాలని ఎంత కోరిక ఉన్నా వాటిని చంపుకోవాల్సిందే. నియంత్రించుకోలేక నాలుగు ముక్కలు నోట్లో పెట్టుకున్నా షుగర్ పెరిగి కోమాలోకి వెళ్ళిపోతారు. రాజకీయరంగం కూడా అంతే. అధికారదర్పాన్ని ప్రదర్శించాలని మనసు రెచ్చగొట్టినా, నియంత్రణలో ఉంచుకోవాల్సిందే.
రెచ్చిపోతే శాశ్వతకోమాలోకి వెళ్ళిపోతారు
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు