వైసీపీ వాలంటీర్ల వ్యవస్థ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా హీటెక్కుతున్నాయో చూస్తున్నాం. వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచి పోషించాల్సి వస్తోంది.
నిరుద్యోగులకు అదో వ్యాపకం.. అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు.! వాలంటీర్ వ్యవస్థలో అందరూ చెడ్డోళ్ళని అనలేం. కానీ, వాలంటీర్ వ్యవస్థ అంటే, ప్రభుత్వ ఖజానాకి సంబంధించినంతవరకు దండగమారి వ్యవహారమే. ఆ ఖర్చుతో, పనికొచ్చే ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల కోసం చేయొచ్చు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులున్నారు. వారితో పని చేయించుకుంటే, వాలంటీర్ వ్యవస్థ కోసం చేస్తున్న ఖర్చు మిగులుతుంది కదా.? అన్న వాదన సబబే.! కానీ, టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలున్నాయ్ గనుక.. వైసీపీ హయాంలో ఈ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారు.
వాలంటీర్ వ్యవస్థకి విరుగుడు మంత్రంగా టీడీపీ ఓ కొత్త ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తోందట. నెలకి 10 వేల రూపాయల జీతం ఇచ్చి, దాదాపు ఐదు లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘పెంచి పోషించే’ కార్యక్రమాన్ని రూపొందించనుందట.
టీడీపీకి ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే కీలకం కాబోతోందని అంటున్నారు. మరీ, పది వేలు అంటే బాగోదనీ, ఓ ఏడెనిమిది వేల రూపాయల వరకు గౌరవ వేతనాన్ని ప్రకటించొచ్చనీ గుసగుసలు వినిపిస్తున్నాయనుకోండి.. అది వేరే సంగతి. ఆ ఐదు లక్షల మంది స్థానంలో మూడు లక్షల సంఖ్య వుండొచ్చనీ అంటున్నారు.
ఏ రాయి అయితేనేం, పళ్ళూడగొట్టుకోవడానికి.! వృధా అయ్యేది ప్రజాధనమే కదా.!