తెలుగుదేశం పార్టీతో కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం జనసేన పార్టీ తరఫున ఓ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. అయితే, టీడీపీ నుంచి సమన్వయ కమిటీ ఏదీ ఇంతవరకు ఏర్పాటు కాలేదు ఈ విషయమై.
అయితే, జనసేన పార్టీకి ఓటెయ్యాలని టీడీపీ క్యాడర్ కొంత మేర మానసికంగా సిద్ధమైపోయిన మాట వాస్తవం. ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇంతకీ, సీట్ల పంపకాల సంగతేంటి.? జనసేన ఆశిస్తున్న సీట్లు ఎన్ని.? టీడీపీ ఇవ్వాలనుకుంటున్న సీట్ల ఎన్ని.?
జనసేన – టీడీపీ మధ్య పొత్తు ఒకింత చిత్రమైనది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి వుంటుంది. అలా జరిగితేనే, కింది స్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది సజావుగా సాగుతుంది. అయితే, చంద్రబాబు జైల్లో వున్న దరిమిలా, టీడీపీ నుంచి నిర్ణయాలు వేగంగా జరగడంలేదాయె.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ విషయమై పెద్దగా ఇబ్బందులు లేనట్టు తెలుస్తోంది. ఇక్కడే నిజానికి, సమస్య ఏర్పడాలి. అయితే, జనసేన పార్టీనే మెజార్టీ సీట్లలో పోటీ చేస్తుందనే సంకేతాలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. ఈ విషయమై టీడీపీ క్యాడర్ కూడా మానసికంగా సిద్ధమైపోయింది.
ఉత్తరాంధ్రలోనూ కొన్ని నియోజకవర్గాల్లో జనసేన వైపే టీడీపీ క్యాడర్ నిలబడే అవకాశాలున్నాయి. రాయలసీమలో మాత్రం చాలా తక్కువ సీట్లలో జనసేన పోటీ చేయనుంది. అక్కడ టీడీపీ వైపుకు జనసేన ఓటు బ్యాంకు పూర్తిగా వెళ్ళాల్సి వుంది.