చంద్రబాబు కోర్టులను బాగా మ్యానేజ్ చేస్తారని.. ఫలితంగా ఇంతకాలం ఎన్ని అవినీతిపనులు చేసినా స్టే లు తెచ్చుకుని బ్రతికేస్తుంటారని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఇదే క్రమంలో… జగన్ సర్కార్ ఏర్పడిన కొత్తలో… ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయంపైనా కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు ఎన్నో చేశారు. అయితే అది గతం. కారణం… న్యాయస్థానంలో వైసీపీకి వరుసగా రెండో అద్భుత విజయం దక్కింది.
అవును… చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. రాజధాని అమరావతిలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ… వాటిని నిగ్గు తేల్చడానికి ఏపీ సర్కార్ “సిట్” ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిట్ ఏర్పాటుపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో టీడీపీ నేతలకు అనుకూల తీర్పు వచ్చింది. దీంతో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో సిట్ ఉద్దేశాలను హైకోర్టు సరిగా అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం “సిట్” కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షాక్ నుంచి టీడీపీ తేరుకునేలోపే మరొక భారీ దెబ్బ పడింది.
రాజధాని అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీపై ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 45 వేల నుంచి దాదాపు 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలగినట్టైంది. అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.45ను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా వాదనలు ముగియడంతో… హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరికో, ఒక వర్గానికో రాజధాని పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిలో భాగంగానే రాజధాని ప్రాంతంలో పేదలకు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తోందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం సరైంది కాదని ఆయన హితవు పలికారు. దీంతో… ఫుల్ జోష్ లో ఉన్న జగన్ సర్కార్… ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటి స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.