తనపైనా, తన పాలనలో జరిగిన అవినీతిపైనా “స్టే” లు తెచ్చుకుని ఇంతకాలం కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శ చంద్రబాబుపై ఉంది. బాబు అదృష్టం ఏమిటోకానీ… ఆయన కోర్టుకు వెళ్లడం ఆలస్యం.. వెంటనే స్టే ఆర్డర్ వచ్చేస్తుందనే కామెంట్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటుంది! అయితే… ఈ విషయంలో ఈసారి బాబుకు కాస్త బ్యాడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్ కు లైన్ క్లియర్ చేస్తూ సుప్రీ కోర్టు తీర్పునిచ్చింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… ప్రభుత్వ తీసుకునే కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా మొదలైన ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో “సిట్” దర్యాప్తునకు జగన్ సర్కార్ ఆదేశించింది. అయితే.. ఆ సిట్ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో… హైకోర్టు ఇచ్చిన “స్టే”ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ సందర్భంగా హైకోర్టు తీర్పూపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు.. సీబీఐ, ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి కాదని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది.
మరి ఈ తీర్పు అనంతరం చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారు.. ఏమేరకు దూకుడు ప్రదర్శిస్తారు.. వారి విమర్శల్లో వాస్తవాలున్నాయని తేల్చడానికి ఏయే ప్రయత్నాలు చేస్తారన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా… ఈ సమయంలో ఏపీ ఫైబర్ గ్రిడ్, అమరావతి భూ అక్రమాలు.. మొదలైన అంశాలపై క్లారిటీ రావొచ్చని తెలుస్తుంది.