అప్పుడే రాయలసీమలో నిరసన ధ్వనులా?

Pothireddy Padu Irrigation Project

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ కంచుకోట లాంటిది. 2019 ఎన్నికల్లో 52 శాసన సభ స్థానాలకు 49 స్థానాలు వైకాపా హస్త గతం చేసుకొన్నది. 2014 ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైకాపాకు ఎదురు గాలి వీచినా రాయలసీమ ప్రాంతంలో అత్యధిక స్థానాలు దక్కించుకొన్నది. ప్రధానంగా డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాభవానికి తోడు అయిదు ఏళ్లు చంద్రబాబు నాయుడు తమకు న్యాయం చేయలేదనే నిరసన భావన పైగా సామాజిక వర్గ భావ జాలం అన్నీ కలగలసి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మ రథం పట్టారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన సంక్షేమ పథకాలతోనే తిరిగి గెలుపు గుర్రం ఎక్కవచ్చనే ధోరణిలో వుంది. ఫలితంగా ప్రధానంగా రాయలసీమ లాంటి మెట్ట ప్రాంతాల్లో కూడా సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి.

జగన్ ను జగ మొండి ఎందుకంటారో తెలుసా?

2004 ఎన్నికల అనంతరం డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జల యజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం రాయలసీమ ప్రజల్లో బలమైన ముద్ర వేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోనికి వస్తే రాజశేఖర రెడ్డి లాగా రాయలసీమలో ప్రతిపాదిత అన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతారని సీమ ప్రజలు ముఖ్యంగా సీమ పరిరక్షణ ఉద్యమ నేతలు ఆశించారు. దానికి తోడు కర్నూలుకు హైకోర్టు వస్తుందని ఘాడంగా నమ్మారు. వైకాపా అధికారంలోనికొచ్చిన తదుపరి మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు రాగానే ముఖ్యంగా యువత సంబర పడ్డారు. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైత్రి పెంచుకోవడం సీమ వాసులు స్వాగతించారు. సీమ సాగు నీటి ప్రాజెక్టులకు గ్రహణం వీడినదని సంబర పడ్డారు.

అయితే సంవత్సరం పూర్తయ్యే సరికి సీమ వాసుల్లో క్రమేణా ఆశలు నీరు గారి పోతున్నాయి. . రాష్ట్ర తొలి బడ్జెట్ లో సీమ ప్రాజెక్టులకు పెద్దగా నిధులు కేటాయించ లేదు. వ్యయం చేసింది లేదు. ఉరుములు లేకుండా పిడుగులు పడినట్లు తెలంగాణ ముఖ్యమంత్రితో చెడింది. అట్టహాసంగా ప్రకటించిన పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకం వివాదంలో చిక్కుకున్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చిర కాల వాంఛితమైన సిద్దేశ్వరం అలుగు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం మొదలౌతుందని చాల మంది మితి మీరిన ఆశలు పెంచుకున్నారు. ఇప్పుడు అవి కనుచూపు మేర అందటం లేదు. టెండర్ పిలుస్తున్న సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం కూడా ఎంత వరకు అమలుకు వస్తుందో అనుమానాలు ఏర్పడుతున్నాయి.

చంద్రబాబు నాయుడు హయాంలో సీమ పరిరక్షణ పేరుతో సాగిన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న పలువురు యువకులు సాగునీటి సాధన సమితి నేతలు వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం డోలాయమానంలో వున్నారు. కొందరు కన్నీటి తుడుపుగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని భావించితే మరికొందరు వేచి చూచే ధోరణిలో వున్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులకు మోక్షం కలిగించుతారని మరి కొందరు నమ్ముతున్నారు. ఒక సెక్షన్ యువత పోరాటాలు తప్పని సరి అవుతుందని సమైక్య రాష్ట్రంలో సీమకు న్యాయం జరగదని ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమని భావిస్తున్నారు.

చంద్రబాబును ఫోర్త జండర్ అన్న విజయసాయి రెడ్డి

ఏది ఎట్లున్నా వైకాపా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల యెడల వ్యవహరిస్తున్న తీరుపై సీమ ప్రజలు ఎప్పుడైనా పేలే అగ్ని పర్వతంలా వున్నారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కాగానే కర్నూలు కడప జిల్లా వాసుల చిర కాలకోర్కె కుందూ నదిపై రెండు ప్రాజెక్టులకు పరిపాలన అనుమతి ఇచ్చారు. కాని ఇంతవరకు టెండర్లు పిలవ లేదు. కుందూ నది నీళ్లు పెన్నలో కలసి నెల్లూరు జిల్లా వాసులకు చేరుతున్నాయనేది వీరి అభ్యంతరం. పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకంపై ఒకవేపు వివాదం నడుస్తుండగా నికర జలాలు కేటాయింపులు వున్న గుండ్రేవుల రిజర్వాయర్ ను రాష్ట్ర జల వనరుల శాఖాధి కారులు వివాదంలోనికి నెట్టడం సీమ ప్రజల్లో పుండుపై కారం రాసినట్లయింది.

ఇవన్నీ అటుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నదని ప్రభుత్వోద్యోగులు పెన్షనర్ల జీతాలకే ప్రభుత్వం వెంపర్లాడుతున్నదనే వార్తలు సీమ వాసులను కలవర పరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ ఎత్తున నిధులు వ్యయం చేయడం ఎంత వరకు సాధ్యమనే మీమాంస సాగుతోంది. దీనికి తోడు సీమ ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్ నుండి కాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివాదాలు లేకుండా కేంద్ర జల సంఘం అనుమతి వున్న ప్రాజెక్టులకైతే అంతర్జాతీయ జాతీయ స్థాయిలో రుణ సౌకర్యం లభిస్తుంది. లేకుంటే కేవలం బ్యాంకులపై ఆధార పడాలి. బ్యాంకుల వద్ద వడ్డీ ఎక్కువగా వుంటుంది. తిరిగి చెల్లించే వ్యవధి తక్కువ కాలం వుంటుంది. ఇప్పటికే తలకు మించి అప్పులు చేస్తున్న ప్రభుత్వం తమ ప్రాంత ప్రాజెక్టులకు ఏ మేరకు రుణాలు సేకరించ గలుగుతుందో పలువురికి అనుమానాలు లేక పోలేదు.

రాయలసీమలో భాగమైన చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు స్వస్థలమైనా 1994 ఎన్నికల తర్వాత ప్రతి దఫా టిడిపి ఎదురు దెబ్బలు తింటోంది. తుదకు 2019 ఎన్నికల్లో ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప అందరూ ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో జిల్లాకు చేసిందేమీ లేదు. అందుకే గంప గుత్తగా వైకాపాకు పట్టం కట్టారు. అయితే ఈ సంవత్సరం కాలంలో ఈ జిల్లాకు ఏమీ జరగ లేదు. రాజ శేఖర్ రెడ్డి కాలం నుండి ఇప్పటి వరకు అమలులో వున్న అన్ని ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేయ బడ్డాయి. విచారకరమైన అంశమేమంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను తిరిగి గెలిపించుతాయని అందరు ఎమ్మెల్యేల్లాగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు. జిల్లాలో అభివృద్ధి పడేసింది. దీనికి తోడు నేడు తిరుపతిని ఆవరించిన కరోనా వైరస్ ప్రభావం వైకాపా ప్రభుత్వానికి మైనస్ పాయింట్.

చంద్రబాబు నాయుడు హయాంలో విసిగి వేసారిన కొందరు యువకులు మేధావులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప సమస్యలు పరిష్కారం కావని ఆలోచించారు. దురదృష్టమేమంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా కొందరు యువకులు ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. వారి చిత్త శుద్ధి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా సీమ యువత సంత్రుప్తిగా లేరనేది గమనార్హం. రాయలసీమలోని కడప జిల్లా సరేసరి. వైకాపాకు గుండె కాయగా వుండిన కర్నూలు జిల్లా నేడు కరోనా వైరస్ తో గడగడ లాడి పోతోంది. రెండవ దశ వచ్చే సరికి ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడి బయటికి రావడం లేదు. నిత్యం వైరస్ బారిన పడుతున్న వందలాది మందికి సరైన వైద్యం లభించడం లేదు. అదే విధంగా మొన్నటి ఎన్నికల్లో అనంతపురం జిల్లా వైకాపా పట్టం గట్టింది. తెలుగు దేశం కోటలు కూలి పోయాయి. కాని నేడు ఆ జిల్లా ప్రజలు సరైన వైద్యం అందక పిట్టల్లా రాలు తున్నారు. ధర్మవరం కు చెంది ఒక రోగి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దిక్కు లేనీ చావుకు గురికావడం గర్భవతి అయిన అతనీ కూతురు భార్య శవం వద్ద దీనంగా వున్న పోటో రాష్ట్ర ప్రజలనే కలచి వేసింది.రాయలసీమలో కరోనా రోగులకు దక్కే వైద్యం ఏలా వుంటుందో ఈ సంఘటన నిదర్శనంగా ఉంది. ఏది ఏమైనా కరోనా వైరస్ కల్లోలం తుదకు ప్రభుత్వం వ్యతిరేక స్వరూపం తీసుకొనే అవకాశం లేక పోలేదు. ఇదే పరిస్థితి మరొక రెండు నెలలు కొన సాగితే సీమ ప్రాంత ప్రజల ఆలోచనా ధోరణి ఎటు మళ్లుతుందో చెప్పలేము.

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు

9848394013