ఈ మధ్య ఏదన్నా పెద్ద సినిమా సెట్స్ మీదకు వెళుతోందంటే, ‘సీక్వెల్ ప్లాన్స్’ అంటూ ప్రచారం జరగడం సర్వసాధారణమైపోయింది. ‘స్కంద’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ‘పెదకాపు’ సినిమాకీ అదే ప్రచారం.. ఉత్త ప్రచారం కాదు, ‘పార్ట్-1’ అనే సినిమాని విడుదల చేశారు, పార్ట్-2 సహా మరికొన్ని పార్టులుంటాయన్న కోణంలో.
‘ఓజీ’కి అదే ప్రచారం, ‘దేవర’ మీదనా అవే గాసిప్స్. విజయ్ దేవరకొండ – సితార బ్యానర్లో నటించే సినిమా విషయంలోనూ ఇలాంటి పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చాలామంది నిర్మాతలు ఇకపై ‘పార్ట్-2’ అన్న సోది వద్దని డిసైడ్ అయ్యారట.
సినిమా హిట్టయ్యాక ఆలోచిద్దాం తప్ప, ముందుగా ఇలాంటి ప్రచారాలు వస్తే వెంటనే ఖండించెయ్యాలని పలువురు నిర్మాతలు తీర్మానించుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో, సీక్వెల్ ప్రచారాన్ని బాగా ఇష్టపడ్డ నిర్మాతలు, ఇప్పుడు దాన్ని పెద్ద తలనొప్పిగా భావిస్తున్నారు.
రాసుకున్న కథని సాగదీసుకుంటూ పోతే, సినిమాల నిర్మాణం ఏళ్ళ తరబడి జరుగుతుందన్న వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే నిర్మాణ సంస్థలు గుర్తిస్తున్నాయి. పైగా, కథ చెడిపోతోందనీ, సినిమాలు సగంలో ఆగిపోయిన ఫీలింగ్‌ని ప్రేక్షకులు ముచ్చడంలేదనీ పెద్ద చర్చే జరుగుతోంది.
ఆ మధ్య ‘ఖుషి’ సినిమా విషయంలోనూ ఇలాగే పార్టులు పార్టులు.. అన్న ప్రచారం తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే.