బ్యాడ్ లక్ పొలిటీషియన్: మళ్లీ ఇలా అవుతందని అను”కోలా”?

ఏడు స్థానాలు అలవోకగా గెలుస్తామనే ఉద్దేశంతోనే వైసీపీ ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను బరిలోకి దింపింది. సామాజిక వర్గాల లెక్కలు వేసి మరీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశామని చెబుతూ అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. అయితే టీడీపీ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టడంతో పొలిటికల్ గేం మొదలైంది. ఈ గేం లో కోలా గురువులు ఓడిపోయారు. దీంతో మరోసారి కోలా గురువుల రాజకీయ జీవితం వెలుగులోకి వచ్చింది.

రాజకీయ గెలుపు కోలా గురువులుతో దోబూచులాడటం ఇది తొలిసారి కాదు. గత 15 ఏళ్లుగా ఆయనకు ఇది మామూలైపోయింది. రాజకీయాల్లో టాలెంట్ కంటే అదృష్టం ఎంత ముఖ్యమనేది కోలా విషయంలో రుజువవుతూనే ఉంది. కోలాతో గెలుపు దోబూచులాటల గురించి తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్లాల్సిందే. పునర్విభజనకు ముందు విశాఖ 1, 2 నియోజకవర్గాలు ఉండేవి గా ఉండే విశాఖలో… 2009 పునర్విభజన అనంతరం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అప్పట్లో సౌత్ నియోజకవర్గంలో ప్రజారాజ్యం తరపున కోలా గురువులు, టీడీపీ తరపున వాసుపల్లి గణేష్, కాంగ్రెస్ తరపున ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు శ్రీనివాస్ బరిలోకి దిగారు.

ఓట్ల లెక్కింపు రసవత్తరంగా జరుగుతుంది. ఆ సమయంలో తాను ఓడిపోయానని భావించిన ద్రోణంరాజు శ్రీనివాస్.. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. దీంతో… గెలుపు తనదే అని కోలా గురువులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆయన అనుచరులు మరో అడుగు ముందుకేసి బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు. తీరా తుది ఫలితం వచ్చేసరికి… ద్రోణంరాజు శ్రీనివాస్ 341 ఓట్ల తేడాతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కోలా గురువులుకి తగిలిన మొదటి షాక్ అదే.

ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున వాసుపల్లి గణేష్, కాంగ్రెస్ తరపున ద్రోణంరాజు పోటీ పడగా.. కోలా గురువులు ఈసారి వైసీపీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కోలా మీద గణేష్ 18వేల మెజార్టీతో గెలిచారు. ఇదే క్రమంలో… 2019లో కోలా గురువులుకు వైసీపీ నుంచి టికెట్ దక్కలేదు. తన గురువుగా భావించే ద్రోణంరాజు వైసీపీలో చేరడంతో ఆయనకే జగన్ టికెట్ ఇచ్చారు. అయితే.. వైసీపీ సునామీలో కూడా వైజాగ్ సౌత్ ఆ పార్టీ గెలవలేదు. ద్రోణం రాజు మీద టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గెలుపొందారు. ఇక 2020లో ద్రోణంరాజు కోవిడ్‌ తో మరణించడంతో… టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్.. వైసీపీకి దగ్గరయ్యారు.

ఈ పరిస్థితుల్లో కోలా గురువులుకు మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్. ఇదే క్రమంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు చెరో 21 వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా.. జయమంగళ గెలిచినట్లు ప్రకటించారు అధికారులు. దీంతో మరోసారి కోలా గురువులుకు ఒకే ఒక్క ఓటు తేడాతో ఎమ్మెల్సీ పదవి దూరమయ్యింది. ఫలితంగా మరోసారి “అధ్యక్షా” అనే కోరిక కలగానే మిగిలిపోయింది!

అయితే… టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వాసుపల్లి గణేష్.. ప్రస్తుతం జగన్ కి కాస్త దూరంగా ఉంటున్నారన్న వార్తల నడుమ.. ఈసారి గణేష్ పైకి వైకాపా తరుపున కోలాకు జగన్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే.. అప్పుడైనా “అధ్యక్షా” అనే కోరిక నెరవేరుతుందేమో చూడాలి!