ఏపీలో స్కిల్ డెవలప్ ప్మెంట్ స్కాం కు సంబంధించిన కేసులో టీడీపీ నేత అరెస్టైన నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా ఏపీ ప్రభుత్వం, పోలీసులు పక్కా ప్రణాళికతో జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా… జనజీవనానికి భారీ ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహారం జరిగిపోయింది. ఈ సమయంలో పవన్ బయలుదేరారు!
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయితే చాలా అల్లర్లు జరిగే అవకాశం ఉందని చాలామంది భావించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపేసిన ఏపీ సర్కార్… బస్సులను డిపోలకు పరిమితం చేసింది. ఇదే సమయంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసింది. ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది.
ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఏపీకి బయలుదేరారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత, హైదరాబాద్ లో ఉన్న పవన్ కల్యాణ్ హుటాహుటిన షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకుని మరీ ఏపీకి బయలుదేరారని తెలుస్తుంది. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన నాయకులతో మీటింగ్ అని చెబుతున్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన రాకను అడ్డుకుంది.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో శాంతి భద్రతల సమస్య వస్తుందని, అందుకే ఆయన్ను హైదరాబాద్ నుంచి బయలుదేరకుండా అడ్డుకోవాలని కోరుతూ… కృష్ణా జిల్లా ఎస్పీ రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ లో స్థానిక పోలీసులు అడ్డుకున్నారు.
ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరాలని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీకి వెళ్లడానికి తనకు అనుమతి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం జనసేన పార్టీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించింది.
ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించిన జనసేన… “ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన పార్టీ పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం నిమిత్తం శనివారం విజయవాడకు బయలుదేరిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకున్న పోలీసులు” అంటూ ట్వీట్ చేసింది.