తానేమీ చిన్నపిల్లాడిని కాదని, తనను ఎవరూ మోసం చేయలేరని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తాజాగా టీడీపీ నేతల గుండెల్లో బాంబు పేల్చారు. దీంతో… కొత్త రాజకీయ చర్చ తెరపైకి వచ్చింది. సీఎం పదవి వద్దు అంటే.. ఇపుడు ఆ ప్రస్తావన వద్దు అన్నదే తన ఉద్దేశ్యం అని ఆయన చెబుతున్నారు పవన్. ఈ సందర్భంగా పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అటు చంద్రబాబుని, ఇటు టీడీపీ కార్యకర్తలను టెన్షన్ కు గురిచేస్తున్నాయి.
జనసేనను బలంగా అభిమానించే కార్యకర్తలు.. పవన్ సీఎం అని ఫిక్స్ అయిపోయారు. అలాంటిది పవన్.. సీఎం పదవి అన్నది తనకు ముఖ్యం కాదు అన్నట్లుగా మీడియాతో మాట్లాడినపుడు వారంతా షాక్ అయ్యారని అంటున్నారు. దీంతో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ… వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్.
సీఎం పదవి వద్దు అంటే ఇపుడు ఆ ప్రస్తావన వద్దు అన్నదే తన ఉద్దేశ్యం అని ఆయన చెప్పుకొచ్చారు. ముందు రాజకీయ శత్రువుని ఓడించాలి. వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించాలి ఇదే అందరి లక్ష్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు తమ్ముళ్లలో టెన్షన్ పుట్టిస్తుంది. రిజల్ట్స్ వచ్చాక ఎవరు సీఎం అన్నది అప్పటి బలా బలాలను బట్టి చంద్రబాబా, పవన్ కల్యాణా అన్నది డిసైడ్ చేద్దామని పవన్ పిలుపునిస్తున్నారు.
సాధారణంగా సీఎం అభ్యర్థి ఫలానా వ్యక్తి అని ఎన్నికలకు వెళ్తారు. అయితే… తాను మాత్రం కొత్త రాజకీయాలకు తెరతీస్తానని చెబుతున్న పవన్… ముందు జగన్ ని ఓడించండి.. టీడిపీ – జనసేన కూటమికి మద్దతివ్వండి.. మళ్లీ ఇందులో జనసేనకు ఎక్కువ ఆదరణ ఇవ్వండి.. ఫలితంగా అప్పుడు వచ్చిన బలం బట్టి సీఎం ఎవరో నిర్ణయిద్దాం అని అంటున్నారు. దీంతో.. ఈ కొత్త రాజకీయం టీడీపీ నేతలను ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు!
మరి పవన్ మాటలను చంద్రబాబు & కో సీరియస్ గా తీసుకుంటారా? లేక, జనసైనికులను ఏమార్చడానికి బాబే అ సలహా ఇచ్చి పవన్ ను పంపించారని తమ్ముళ్లు భావిస్తారా? అదీగాక, పవన్ ఆడుతున్న కొత్త డ్రామా ఇదని, పవన్ కు అంత సీన్ లేదని జనసైనికులు భావిస్తారా అన్నది వేచి చూడాలి!