ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో సర్వే వెలుగు చూసింది. ఈ సర్వే కూడా వైసీపీకి అనుకూలంగానే తీర్పునిచ్చింది. 135 వరకూ అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకోనుందట. టీడీపీకి వచ్చే సీట్ల సంఖ్య 2019తో పోల్చితే కాస్త పెరగనుంది. జనసేన కూడా చెప్పుకోదగ్గ సీట్లను గెలుచుకుంటుందట.
జనసేనకి వచ్చే సీట్ల సంఖ్య 5వరకు వుండొచ్చనీ, 30కి పైగా సీట్లలో టీడీపీ గెలుస్తుందనీ తాజా సర్వే అంచనా వేసింది. అయితే, జనసేన ప్లస్ బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తే వచ్చే సీట్లు ఇవి. టీడీపీ కూడా బీజేపీ, జనసేనతో కలిస్తే ఈక్వేషన్ ఎలా వుంటుందన్నది తేలాల్సి వుంది.
కాగా, మెజార్టీ సర్వేలు వైసీపీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కాదు కాదు, సర్వేలన్నీ వైసీపీ చేయించుకుంటున్నవేనన్న విమర్శ లేకపోలేదు. అందులో కొంత నిజమూ వుండొచ్చు. ఎందుకంటే, సర్వేలు అధికార పార్టీలకు అనుకూలంగానే చాలావరకు వుంటాయి. ఎక్కువగా అధికార పార్టీనే సర్వేలు చేయించుకుంటుంటుంది.
ప్రజా వ్యతిరేకత ఎంత వుంది.? అని తెలుసుకోవడానికి వైసీపీ, గత కొన్నాళ్ళుగా సర్వేల్ని ఆశ్రయిస్తున్నమాట వాస్తవం. ఐ-ప్యాక్ టీమ్ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ, అధికార వైసీపీని హెచ్చరిస్తోంది. 60 శాతానికి పైగా సిట్టింగులు ఓడిపోతారని ఐ-ప్యాక్ టీమ్ చెప్పినట్లుగా గతంలో ప్రచారం జరిగింది.
అయితే, సర్వేలు.. వాటి అంచనాల ఆధారంగా.. ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుు తగిన చర్యల్ని వైసీపీ చేపడుతోంది. దాంతో, వైసీపీ గతంతో పోల్చితే కొంత మెరుగైన స్థితికి చేరుకుందని (అంటే, ప్రజా వ్యతిరేకత విషయంలో) వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
ముందస్తు సర్వేల ఫలితాలు వేరు.. ఎన్నికల నాటికి కనిపించే మూడ్ వేరు.! ఓటరు నాడి ఎలా వుందన్నది అప్పుడే తెలుస్తుంది. అయితే, ఇప్పుడు కనిపిస్తున్న సర్వేల ఫలితాలు మాత్రం, విపక్షాలకు అస్సలు మింగుడుపడవు.!