వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కష్టమేనా.? టిక్కెట్టు కోసం ముఖ్యమంత్రి దగ్గర లాబీయింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా.?
ఒకప్పుడు అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యం కారణంగానే ఆయనకు మంత్రి పదవి దక్కింది. అది కూడా జల వనరుల శాఖ. చిన్న విషయం కాదది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పదే పదే డెడ్లైన్లు పెడుతూ, రాజకీయ ప్రత్యర్థుల్ని తూలనాడుతూ.. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి హోదాలో నానా యాగీ చేశారు.
మంత్రి పదవి పోగానే, ‘పదవి పోయింది.. నేను మంత్రిని కాదు. పోలవరం ప్రాజెక్టుతో నాకేంటి సంబంధం.?’ అనేశారు అనిల్ కుమార్ యాదవ్. అప్పటినుంచి మొదలైంది ఆయన పట్ల వైసీపీలో కొంత వ్యతిరేకత.
నెల్లూరు జిల్లాలో సహచర వైసీపీ నేతలతో విభేదాలు.. ఇవన్నీ అనిల్ కుమార్ యాదవ్ స్థాయిని పార్టీలో తగ్గిస్తూ వచ్చాయి. అయితే, వాగ్ధాటి, ప్రత్యర్థుల మీద ఘాటైన విమర్శలు చేయగలగడం.. ఈ లక్షణాలే అనిల్ కుమార్ యాదవ్‌ని ఇంకా వైసీపీలో ముఖ్య నేతగా చాలామంది పరిగణించేలా చేస్తున్నాయి.
కానీ, నానాటికీ అనిల్ కుమార్ యాదవ్ తన స్థాయిని తగ్గించుకుంటూ పోతున్నారు. జిల్లాలో కీలక వైసీపీ నేతలతో వైరం.. అనిల్ కుమార్ యాదవ్‌కి మైనస్ అవుతోంది. ‘పార్టీకి ఆయన వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది..’ అనే రిపోర్ట్స్ అధినేత వద్దకు వెళ్ళాయట. వీటికి తోడు, గడప గడపకూ మన ప్రభుత్వం తదితర కార్యక్రమాల్లో అంత ఉత్సాహంగా ఆయన పాల్గొనలేదన్న విమర్శలూ వున్నాయి. ఈ కారణాలతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ టిక్కెట్ నిరాకరించే అవకాశాలు వున్నాయంటున్నారు.