నమ్మితే నమ్మండి.. లేకపోతే మీ ఖర్మ.! విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగిపోయినట్లే.! ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ గట్టిగా చెప్పేస్తోంది. తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ కూడా ఇదే మాట చెబుతోంది. ‘ప్రస్తుతానికైతే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్ళాలనుకోవడంలేదు..’ అని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గస్ సింగ్ కులస్తీ కూడా చెబుతున్నారు.
ఇది ఊహించని పరిణామమే. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పట్టుదలతో వుంది. ‘కుదిరితే అమ్మేస్తాం, లేకపోతే మూసేస్తాం.. ఎవరికీ భయపడేది లేదు..’ అని గతంలో కేంద్రం పలు మార్లు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై తెగేసి చెప్పింది. ఇప్పుడేమో, ‘ముందుకు వెళ్ళడంలేదు’ అంటూ ఉక్కు శాఖ సహాయ మంత్రి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కేంద్రం మెడలు తామే వంచేశాయంటూ వైసీపీ, బీఆర్ఎస్.. ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంతకీ, కేంద్రం మెడలు వంచగలిగారా.? లేదా.? ముందుకు వెళ్ళడంలేదని అన్నారుగానీ, వెనక్కి తగ్గామని చెప్పట్లేదు కదా.? కేంద్రం చేసిన ఈ ప్రకటన విషయమై కాస్త ఆచి తూచి స్పందించాలి ఎవరైనా.
‘అది కేంద్రానికి సంబంధించిన వ్యవహారం.. మాకేటి సంబంధం.?’ అంటూ తొందరపడి వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో రాజకీయ పార్టీలు ఎలా ఆటలాడుతున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.!
ఏదో లాభం ఆశించి, కేంద్రం ‘ముందుకెళ్ళడంలేదు’ అన్న ప్రకటన చేసింది తప్ప, విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడంలో కేంద్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. బహుశా 2024 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యూహాత్మక అడుగుని మోడీ సర్కారు వేసినట్లుంది.