రాజమండ్రిలో మహానాడు… ఈ లాజిక్ మరిచారా?

తెలుగుదేశం పార్టీ పండుగ “మహానాడు” కు రాజమండ్రి సిద్ధం అవుతుంది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి మహానాడు సభలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయిపోతున్నాయి. అయితే ఈ విషయంలో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈసారి మహానాడుకు రాజమండ్రిని ఎంపిక చేసే విషయంలో టీడీపీ నేతలు ఈ లాజిక్ ఎందుకు మిస్సయ్యారనే చర్చ గోదావరి జిల్లాల్లో నడుస్తుంది.

రాజమహేంద్రవరంలో మహనాడు నిర్వహించే ఆలోచన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ సీరియస్‌ అయ్యారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వమని.. పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు తీసే వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవటం ఎందుకు?.. ఆనాక శత జయంతి ఉత్సవాలు జరపడమెందుకు అని ప్రశ్నించారు. ఈ సమయంలో మార్గాని ఒక కీలక విషయాన్ని తెరపైకి తెచ్చారు.

ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని.. ఇప్పుడు అదే రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తున్నారని ఫైరవుతున్నారు భరత్. నాడు చంద్రబాబు నిర్వాకంతోనే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని.. ఫలితంగా పబ్లిసిటీ కోసం చంద్రబాబు 29 మంది ప్రాణాలు తీశారని చెబుతున్నారు. ఆ సమయంలో కనీసం మృతుల కుటుంబాలను కూడా చంద్రబాబు పరామర్శించలేదన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

గతంలో రాజమండ్రి వేదికగా ఇన్ని దారుణాలు చేసిన చంద్రబాబు… నేడు ఏ మొహం పెట్టుకుని అదే రాజమండ్రిలో మహానాడు పెట్టారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పుష్కరాల సమయంలో పబ్లిసిటీ పనుల్లో 29మంది దారుణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై అప్పట్లో చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైగా మృతుల కుటుంబాలను సైతం పరామర్శించేపని కూడా నాడు చంద్రబాబు చేయలేదు.

దీంతో… జనం కొద్దో గొప్పో మరిచిపోయిన ఆ చేదు జ్ఞాపకాన్ని… రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని ఫిక్సయవడంతో మరోసారి జనాల్లోకి తీసుకొచ్చినట్లయ్యింది. ఫలితంగా సోషల్ మీడియాలో నాటి పుష్కర మృతుల ఫోటోలు, ఆ సమయంలో చంద్రబాబు ఇచ్చిన ప్రజావ్యతిరేక స్టేట్ మెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.