కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాపై పలు విషయాల్లో విమర్శలు గుప్పిస్తూ.. ట్వీట్ల వర్షాలు కురిపించే తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాజాగా థ్యాంక్స్ చెప్పారు. విధానాల పరంగానే తమ విమర్శలు ఉంటాయి తప్ప.. వ్యక్తిగత కక్ష సాధింపుల దిశగా కాదని చెప్పే ప్రయత్నమో.. లేక, బీజేపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తనట్వీట్ల పోరాట ఫలితమని చెప్పే ఉద్దేశ్యమో తెలియదు కానీ… తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న ఒక నిర్ణయానికి కేటీఆర్… థాంక్స్ చెప్పారు.
అవును… కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఆర్పీఎఫ్ లో ఉద్యోగాల నియామక పరీక్ష పత్రాన్ని 13 స్థానిక భాషల్లో నిర్వహించాలని హోం శాఖ నిర్ణయించింది. ఇంగ్లీష్, హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వాలని నిర్ణయించింది.
దీంతో… కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. “సీఆర్పీఎఫ్ పరీక్షను తెలుగుతో పాటు 13 స్థానిక భాషల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందుకు గాను.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నా ధన్యవాదాలు. ఇది వేలాది మంది తెలుగు మాట్లాడే రాష్ట్రాల అభ్యర్థులకు తప్పకుండా ఉపయోగపడుతుంది” అని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కాగా…. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా ప్రజలపై రుద్దుతోందనే విమర్శ దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా వినిపిస్తుంటుంది. దీంతో… స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం మానుకోవాలంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా గతంలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభించింది. ఇదే క్రమంలో… ఇటీవల పెరుగు ప్యాకెట్లపై ‘దహీ’ అని రాయాలనే నిబంధనపై కూడా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వెనక్కితగ్గి… 13 స్థానిక భాషల్లో సీఆర్పీఎఫ్ పరీక్ష నిర్వహణకు సిద్ధపడుతోంది.
I thank HM @AmitShah Ji for agreeing to conduct the CRPF examination in 13 regional languages including Telugu
This will surely help thousands of aspirants from Telugu speaking states https://t.co/Vxg8QtHPCC
— KTR (@KTRBRS) April 15, 2023