కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చినప్పుడు మీరెంత పెట్టి నన్ను కొనుక్కున్నారు.? అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఈ రోజుల్లో రాజకీయాలు చాలా ఖరీదైపోయాయ్.! రాజకీయమంటే కోట్లతో జరిగే ఓ వ్యాపారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. మరి, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న రాజకీయ వ్యాపారం సంగతేంటి.? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఎంత మొత్తానికి అమ్ముడుపోయారు.?
పార్టీని ధిక్కరించేవారిపై సస్పెన్షన్ వేటు వేటు తప్పదనే సంకేతాల్ని నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా పంపించింది వైసీపీ. ఈ క్రమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుస్సా అయ్యారు. పార్టీ కోసం చాలా పెద్ద మొత్తంలో తాము ఖర్చు చేశామంటున్నారాయన. ఒక్కమాటలో చెప్పాలంటే, టిక్కెట్ కోసం అలాగే గెలవడం కోసం కోట్లు ఖర్చు చేశామన్నది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ. అంటే, డబ్బులిచ్చే ఆయన టిక్కెట్టు కొనుక్కున్నారన్నమాట.
అంటే, అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తుందన్నమాట వైసీపీ. ఈ విషయం నాలుగేళ్ళ తర్వాత మేకపాటికి ఎందుకు గుర్తుకొచ్చిందో ఏమో.! అప్పుడు ఖర్చు చేశారు కాబట్టి, ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు టీడీపీకి అమ్ముడుపోయారా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. రాజకీయం అనేది కేవలం వ్యాపారం.. అన్న వాదనలకు మేకపాటి రచ్చ బలాన్నిస్తోంది.