పవన్ దృష్టిలో రాజకీయాలంటే ఏమిటి? పవన్ దృష్టిలో ప్రజలకు సేవ చేయడం అంటే ఏమిటి? అంతకంటే ముఖ్యంగా తనను విపరీతంగా అభిమానిస్తూ, తన సినిమాలను ఆదరించే అభిమానుల విషయంలో పవన్ అభిప్రాయం ఏమిటి? కాపు సామాజికవర్గ ప్రజల పట్ల ఆయనకున్న అవగాహన ఏమిటి? తాను ఎలా ఆడిస్తే అలా ఆడేవారనా.. లేక, తాను ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారనా? పవన్ ఆ సామాజికవర్గ ప్రజల గురించి ఏమనుకుంటున్నారు?
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఒక చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. దానికి కారణం వారాహి యాత్రలో భాగంగా తాజాగా ప్రత్తిపాడు సభలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు. అవును… ప్రత్తిపాడు సభలో మైకందుకున్న పవన్ కాపు రిజర్వేషన్ పై ఏమన్నారో ఆయన మాటల్లోనే ఒకసారి చూద్దాం!
“మొన్న ఎన్నికల్లో జగన్ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వనని కరాఖండీగా చెప్పేశాడు. జగన్ ధైర్యానికి నాకు ముచ్చటేసింది. కానీ కాపులు ఆయనకే ఓట్లేశారు. ఇందులో నా అభిమానులూ ఉన్నారు. 60 శాతం కాపులు వైసీపీకి, 30శాతం జనసేనకు ఓట్లు వేశారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని, ఛీ అని అంటున్న నాయకుడు సీఎంగా ఉండాలా.. దళితుల పథకాలను ఎత్తేసిన వ్యక్తి సీఎంగా ఉండాలా? కులాల మధ్య గొడవలు సృష్టించి విడదీయడమే జగన్ ఎజెండా” అని విమర్శించారు.
దీంతో గతాన్ని పవన్ కు గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. ఒకసారి గతానికి వెళ్తే… 2014లో ఎన్నికల్లో జనసేన.. చంద్రబాబుకు మద్దతు తెలిపింది. ఆ సమయంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్స్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పవన్ ఉన్నాడుగా పక్కన… కచ్చితంగా జరుగుతుందని నమ్మిన కాపు ఓటర్లు బాబుకు బలంగా ఓట్లు గుద్దారు. చంద్రబాబు సీఎం అయ్యారు.
కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ హామీ అటకెక్కింది. ప్రశ్నిస్తానన్న పవన్ కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఏ కలుగులో దాక్కున్నారో.. అనంతరం కనుమరుగైపోయారు! ఫలితంగా వీరిద్దరి చేతిలో కాపు సామాజికవర్గం వంచనకు గురైంది.
దీంతో కాపులకు నమ్మకస్తుడైన నాయకుడిగా పేరున్న ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగారు. కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రశ్నిస్తూ.. దీక్షకు దిగారు. అయితే ఆ సమయంలో ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని పోలీసులతో చితక్కొట్టించారు చంద్రబాబు! అప్పుడు కూడా పవన్ స్పందించలేదు. ముద్రగడ ఇంట్లోని ఆడవారిని సైతం ఇబ్బందులకు గురిచేశారు.. అప్పుడు కూడా పవన్ మౌనాన్నే నమ్ముకున్నారు.
ఈలోపు 2019 ఎన్నికలు వచ్చాయి. కాపులకు రిజర్వేషన్ అంశం తన చేతిలో లేదని, వారి అభివృద్ధి కోసం భారీ మొత్తంలో నిధులు మాత్రం ఖర్చు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. కాపులు మరోసారి రాజకీయ వాగ్ధానాలను నమ్మారు. తప్పుడు హామీలిచ్చి తర్వాత తప్పించుకుని తిరగకుండా.. ఇచ్చిన సరైన హామీని జగన్ నిలబెట్టుకున్నారు! అయినా కూడా ఇప్పుడు జగన్ ను కాపుల పాలిట విలన్ గా చిత్రీకరించడానికి పవన్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.
పక్కనే ముద్రగడ ఉన్నారని మరిచారో.. లేక, చంద్రబాబు ప్రయోజనాల కోసం తాను ఎంతకైనా తెగిస్తానని చెప్పదలచుకున్నారో తెలియదు కానీ… ఇలా కాపులను మరోసారి వంచించే పనికి పూనుకున్నారు. ఫలితంగా గతంలో తనతో కలిసి చంద్రబాబు చేసిన వంచనను మసిపూసి మారేడు కాయ చేయాలని ప్రయత్నించారు! తన వారాహి యాత్ర మొదటిసభలోనే పవన్ ఇలా స్పందించారు!! కాపుల జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేసే సాహసం చేశారు!