మూడు రాజధానులతోనే ముందుకు

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఏ ముహూర్తంలో అయితే చంద్రబాబు కలల రాజధాని అమరావతిని ఎద్దేవా చేస్తూ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసాడో, దాన్నే ఖాయం చేస్తూ నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం జరిగిపోయింది.  అమరావతి అంగుళం కూడా కదలదు అంటూ తెలుగుదేశం నాయకులు, కొందరు బీజేపీ నాయకులు ఆర్బాటంగా చేసిన ప్రకటనల మెట్లను దాటుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ఏకంగా అయిదు వందల కిలోమీటర్ల దూరాన గల విశాఖపట్నానికి తరలిపోవడానికి రంగం సంపూర్ణంగా సిద్ధం అయింది.  ఇక ఏవైనా బలమైన అదృశ్య శక్తులు అడ్డుకుంటే తప్ప రాజధానిని ఆపడం బ్రహ్మతరం కూడా కాదేమో?  రాజధాని మార్పు అంశంలో ముఖ్యమంత్రి జగన్ తనమాటను నెగ్గించుకున్నారు.  అసెంబ్లీ సాక్షిగా తన పంతాన్ని చట్టబద్ధం చేయించారు.  ఇక పాలనా రాజధాని విశాఖపట్నం అనేది లాంఛనమే!   సాక్షాత్తూ నాటి ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని ఏమాత్రం జంకూగొంకూ లేకుండా తరలించాలని జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యచకితులను చేస్తున్నది.  తాను స్వయంగా పునాదిరాయి వేసినా, విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం కోసం మోడీ  ఒక్క రూపాయి కూడా  ఇవ్వనప్పుడు మోడీ తో మొహమాటం ఏమిటని జగన్ భావించారేమో మరి!  భవిష్యత్తులో కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదని,  లక్షకోట్ల నగరాన్ని కట్టడానికి పదేపదే కేంద్రాన్ని దేబిరించే బదులు ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం అయితే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుందని జగన్ అభిప్రాయం కావచ్చని విద్యావంతులతో పాటు సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు.  
 
 
ఇక అసెంబ్లీ సమావేశాలు ఎప్పటిలాగే వాడిగా, వేడిగా జరిగాయి.  మొదటగా  ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దాదాపు  మూడుగంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు.    2014  జూన్ రెండోవారంలో  చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజునుంచి డిసెంబర్ వరకు తెలుగుదేశం నాయకులు, మంత్రులు ఎవరెవరు ఎన్నెన్ని ఎకరాల భూమిని కొన్నారో సర్వే నంబర్లతో సహా చిట్టాను సభముందుంచారు.  ఈ జాబితాలో చంద్రబాబుతో పాటు మురళీమోహన్, సుజనాచౌదరి, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి పెద్ద తలకాయలతో పాటు, నాటి తెలుగుదేశం అధికారప్రతినిధి లంకా దినకర్ కూడా రైతులనుంచి కొన్న భూముల వివరాలను చదివి వినిపించారు.   రాజధాని నిర్మాణం పేరుతో అక్కడ నలభైవేలకోట్ల రూపాయల భూకుంభకోణం జరిగిందని ఆరోపించారు.  
 
  
అసెంబ్లీ తీర్మానం ద్వారా రాజధాని తరలింపు నిర్ణయం జరిగింది కాబట్టి ఇక విశాఖకు సచివాలయం, రాజ్ భవన్ తరలివెళ్లడం దాదాపు లాంఛనం  భావించవచ్చు.  న్యాయపరమైన చిక్కులు రాకుండా, ఈ విషయంపై జగన్ ప్రభుత్వం సకల జాగ్రత్తలను తీసుకున్నదని చెప్పుకుంటున్నారు.     గత అయిదు వారాలుగా రాజధాని గ్రామ ప్రాంతాల రైతులు చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు ప్రభుత్వం  ఏమాత్రం ఖాతరు చెయ్యలేదు.  నెలరోజులకు పైగా రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ, ఆ పాతిక ముప్ఫయి గ్రామాల ప్రజలు తప్ప ఇతర జిల్లాలు, ప్రాంతాలనుంచి వారికి ఎలాంటి మద్దతు లభించకపోవడం ప్రభుత్వానికి వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.  రాబోయే కాలంలో రాష్ట్ర సంపద, ఆదాయం  మొత్తం అమరావతి మీదనే ఖర్చు చెయ్యాల్సి వస్తుందన్న ప్రభుత్వం చేస్తున్న  వాదన ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయినట్లుంది.  అంతేకాకుండా, సచివాలయాన్ని, రాజ్ భవన్ ను విశాఖలో ఏర్పాటు చేస్తే ఇక నగర అభివృద్ధికి ఎక్కువగా ఖర్చు చెయ్యాల్సిన అవసరం లేదని, అయిదారువేలకోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలు నిర్మించుకుంటే చాలని, అక్కడ కూడా ప్రభుత్వ భూముల లభ్యత ఉన్నదని ప్రభుత్వం సమర్ధించుకోవడం ప్రజలను నమ్మిస్తున్నది.  గత అరవై ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురికాబడిందని, అలాగే రాయలసీమ ప్రాంతం కూడా వెనుకబడిందని, ఈ పరిస్థితుల్లో విశాఖలో పాలనా రాజధాని, కర్నూలులో హైకోర్టు, ఇతర న్యాయకార్యాలయాలను ఏర్పాటు చెయ్యడం ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని సాధించడం సాధ్యం అవుతుందని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. 
 
ఇక రాజధాని తరలింపును అడ్డుకోవాలని తెలుగుదేశం, వామపక్షాలు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అయినట్లే భావించవచ్చు.  కేంద్రప్రభుత్వం రాజధాని విషయంలో జోక్యం చేసుకుంటుందని ఇన్నాళ్లూ కొందరు బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నా, అలాంటి ఉద్దేశ్యం కేంద్రానికి లేదని స్పష్టమైపోయింది.  అంతే కాకుండా, మూడు రాజధానుల ముచ్చటను చాలాకాలం క్రితమే జగన్ కేంద్రమంత్రులకు, మోడీకి చేరవేసినట్లు సమాచారం.  మోడీ, అమిత్ శాలు అందుకు అంగీకరించారని, ఆ ధైర్యంతోనే జగన్ మొండిగా ముందుకు వెళ్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  సుజనాచౌదరి లాంటి ఇటీవలే బీజేపీలో చేరిన కొందరు నాయకులు “కేంద్రం చూస్తూ ఊరుకోదు” అంటూ మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడుతున్నప్పటికీ,  బీజేపీ కేంద్ర అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఏనాడో కుండబద్దలు కొట్టారు.  రాజధాని విషయంలో కేంద్రం కల్పించుకోదని ఆయన స్పష్టం చేసారు.  
 
రాజధాని రాకను ఏమాత్రం కలలో అయినా ఊహించని విశాఖపట్నం వాసులు తాజా పరిణామాల పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అలాగే ఎప్పుడో ఆరున్నర దశాబ్దాల క్రితం చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందంలోని అంశం నేటికి నెరవేరుతున్నందుకు రాయలసీమ వాసులు కూడా సంతోషిస్తున్నారు.  అయితే రాజధాని తమ ప్రాంతం నుంచి తరలిపోతుంటే కృష్ణా జిల్లా వాసులు, గుంటూరు వాసులు పెద్దగా చలించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.  అమరావతి భ్రమరావతిగా మారిపోయిందనే వైరాగ్యమా లేక తాము ఎంత పోరాడినా ప్రయోజనం ఉండదనే విరక్తా అనేది కాలగమనంలో తెలుస్తుంది.  
ప్రస్తుతానికైతే జగన్ తన అభిమతాన్ని నెరవేర్చుకున్నట్లే.   
 
 
Ilapavuluri Murali Mohan Rao
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు