ఆర్ధికవ్యవస్థను కుప్పకూల్చిన లాక్ డౌన్ 

ఒకటి కాదు..రెండు కాదు. తెలుగు . రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం  రోజుకు సుమారు వెయ్యి కోట్ల   రూపాయలు!  నెలకు 30 వేల కోట్ల  రూపాయల పై చిలుకే.   గత నెలరోజుల్లో ఆర్జించింది పదికోట్ల రూపాయలు కూడా లేదు!  ఇంతటి దయనీయమైన పరిస్థితి స్వతంత్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రమూ,  ఆ మాటకొస్తే భారతదేశమే చూడలేదు.  కంటికి కనిపించని శత్రువుతో పోరాటానికి మనదేశం భారీమూల్యాన్ని చెల్లించుకోవాల్సివచ్చింది.  దేశం మొత్తం స్తంభించిపోయింది. 
 
రైళ్లు, బస్సులు, ఆటోలు, విమానాలు, లారీలు, టాక్సీలు…ఇలా ఒకటేమిటి?  రవాణావ్యవస్థ అనేది ఇంత సుదీర్ఘకాలం పడకేయడం  ఇదే తొలిసారి.  అంతేకాదు…ఒక కాలనీవారు మరొక కాలనీలోకి,  ఒకే పట్నంలో నివసించేవారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి వెళ్లలేకపోవడం…ఒక ఊరివారు మరొక గ్రామంలోకి వెళ్లలేకపోవడం…ఇంకా చెప్పాలంటే ఒకే చోట నివసించే వారు ఒక అపార్ట్మెంట్ నుంచి మరొక అపార్ట్మెంట్ లోకి ప్రవేశించలేకపోవడం….ప్రసిద్ధి చెందిన యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, తిరుపతి, శ్రీ కాళహస్తి, సింహాచలం, అన్నవరం, షిరిడి లాంటి పుణ్యక్షేత్రాలు నలభై రోజులకు పైగా భక్తులకు ప్రవేశం లేకుండా చేస్తాయని ఎన్నడైనా ఊహించామా?    ఇన్నిన్ని   విచిత్రాలు జరుగుతాయని కాలజ్ఞాని బ్రహ్మంగారైనా చెప్పారో లేదో మరి!
 
కరోనా మనకు నేర్పిన పాఠాలు, గుణపాఠాలు అన్నీఇన్నీ కావు.  పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో, దేవాలయాల్లో, మార్కెట్లలో, దవాఖానాల్లో  మనుతో రాసుకుని పూసుకుని, తోసుకుని తిరిగే మనం..ఈనాడు సాటి మనిషిని చూస్తేనే భయపడి పక్కకు తప్పుకుంటున్నాము.  బజార్నుంచి వచ్చేటపుడు పండ్లు, కూరలు కొనుక్కుని రాగానే నేరుగా తీసుకెళ్లి ఫ్రిజ్జులో పెట్టకుండా, బయటనే ఎండలో పెడుతున్నాము.  రోజుకు పదిసార్లు చేతులను సబ్బుతో కడుక్కుంటున్నాము.  బయటనుంచి రాగానే నేరుగా బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయి బట్టలు విప్పేసి, శుభ్రంగా స్నానం చేసిన తరువాతే మంచినీళ్లు  ముట్టుకుంటున్నాము.  అత్యవసర పనుల నిమిత్తం బ్యాంకులకు, సూపర్ మార్కెట్లకు వెళ్తే మన ముందు నిలుచున్న మనిషికి కనీసం మూడు అడుగుల దూరంలో నిలుచుంటున్నాము.  ముఖాలకు మాస్కులు తగిలించుకుని బయటకు వెళ్తున్నాము.  అబ్బో…ఇన్ని ఆరోగ్యసూత్రాలను మనం అంతకుముందు ఎప్పుడైనా పాటించామా?  మద్యపానం, ధూమపానం మానండి అని డాక్టర్లు చెబితే పెడచెవినపెట్టే మనం గత నెలరోజులుగా చచ్చినట్లు ఆ దురలవాట్లకు దూరంగా ఉంటున్నాము.  మద్యం సంగతేమో కానీ, ధూమపానం నుంచి చాలామంది ఈ కరోనా దెబ్బకు విముక్తులు కావడం ఖాయం.  
 
అసలు విషయానికి వస్తే…..కోవిద్ – 19 వైరస్ గూర్చి కేంద్రప్రభుత్వం మొదట్లో చాలా తక్కువ అంచనా వేసింది.  ఇంకా చెప్పాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరించింది.  గత నవంబర్ లోనే కరోనా ఆనవాళ్లు బయటపడ్డప్పటికీ దేశంలో ఆ వైరస్ ప్రవేశించకుండా నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం అయింది.  నిజానికి మొన్న ఫిబ్రవరిలో ట్రంప్ మనదేశంలో పర్యటించేనాటికే మనదేశంలో వైరస్ జాడలు కనిపించాయి.  అయినప్పటికీ, లక్షలాదిమందితో ట్రంప్ కు స్వాగతసత్కారాలు ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం.  జన సమూహాలను నియంత్రించాలన్న స్పృహ కూడా కేంద్రానికి లేకపోయింది.  ఒకరినుంచి మరొకరికి తొందరగా వైరస్ వ్యాపిస్తుంది అన్న అంచనాలు కూడా మోడీ ప్రభుత్వానికి కొరవడింది అనేది వాస్తవం.  ప్రభుత్వం కళ్ళు తెరిచేనాటికి కరోనా విజృంభణ ప్రారంభం అయింది.  దాంతో హడావిడిగా లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. కనీసం పదునాలుగు రోజులపాటు ఎవ్వరూ ఇళ్లనుంచి కదలకుండా ఉంటే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని, ఆ తరువాత మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను భరిస్తే కరోనా పారిపోతుందని నమ్మబలికారు. 
 
సాక్షాత్తూ ప్రధాని చెప్పారు కాబట్టి ఆయన నిర్ణయానికి అన్ని రాష్ట్రాలు మద్దతు పలికాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు.  మోడీ నిర్ణయాన్ని ప్రశంసించారు.  తెలంగాణాలో లాక్ డౌన్ ను చాలా కఠినంగా అమలు చేశారు.  పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు నిద్రాహారాలు లేకుండా ప్రభుత్వానికి సహకరించారు.  నిత్యజీవితంలో ప్రతి చిన్నదానికి పోలీసులను నిందించే పౌరసమాజం ఈ క్లిష్టసమయంలో పోలీసులు నిర్వహించిన విధులను, దీక్షాదక్షతలను  చూసి వారిని ముక్తకంఠంతో ప్రశంసించారు.  మూడు వారాల పాటు…అనగా పదునాలుగు ఏప్రిల్ వరకు లాక్ డౌన్ ను పాటించారు.  అయినప్పటికీ, కరోనా అంతం కాలేదు సరికదా…కేసుల పెరుగుదల ఏమాత్రం ఆగిపోలేదు.  దాంతో లాక్ డౌన్ ను ఈ నెల మూడు వరకు పొడిగిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణాలో మాత్రం ఈ నెల ఏడు వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.  
 
ఆ గడువు కూడా ముగిసిపోనున్నది.  అయినప్పటికీ, ప్రతిరోజూ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.  దేశవ్యాప్తంగా ఆ సంఖ్య పాతికవేలు దాటింది.  మరణాలు వెయ్యి దాటాయి.  దీన్నిబట్టి చూస్తే కరోనాను అడ్డుకోవడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని రుజువైంది.  కరోనా వైరస్ ను నివారించే మందులు లేవు.  వాక్సిన్ ను కనుగొనడానికి ఇంకా ఏడాదిన్నరకు పైగానే పడుతుందంటున్నారు. 
 
అంటే, అంతవరకు కరోనా అనేది మన సమాజంలో ఒక భాగం అవుతుందనేది స్పష్టం.  మరి అలాంటప్పుడు ఏమి చెయ్యాలి?  మరో ఆరు నెలలు, ఏడాది ఇలా లాక్ డౌన్ ను కొనసాగిస్తూ పోవాల్సిందేనా?  కేవలం  నెలరోజుల లాక్ డౌన్ కే ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలు ఆదాయాన్ని భారీగా కోల్పోయి, ఉద్యోగుల వేతనాల్లో కోతలు వేస్తున్నాయి.  చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారులు, పరిశ్రమలు, మీడియా సంస్థలు, ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయి నిరాశానిస్పృహల్లోకి జారిపోతున్నారు.  లాక్ డౌన్ తరువాత ఎంతమంది ఉద్యోగాలు ఉంటాయో, ఎన్ని ఊడిపోతాయో చెప్పలేని పరిస్థితి.  జీతాల్లో యాభై శాతం కోసేసినా నోరు విప్పలేని దుస్థితి నెలకొంది. 
 
ప్రయివేట్ వారు తమ ఖర్చుల్లో భారీగా కోతలు విధించుకుంటారు.  కానీ, ప్రభుత్వానికి అది సాధ్యం కాదు.  సంక్షేమ పధకాలు ఆగిపోతే ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుంది.  ప్రభుత్వం చెల్లించాల్సిన చెల్లింపులు నిలిచిపోతాయి.   విద్యుత్ వినియోగం పడిపోవడంతో సంస్థలు నష్టాల్లో కూరుకుని పోతాయి.   వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోతే రైతులు భారీగా నష్టపోతారు.  పన్ను వసూళ్లు నిలిచిపోతే ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పధకాలను అమలు చెయ్యలేదు.  కేంద్రం వైఖరి చూస్తుంటే రాష్ట్రాలను ఆదుకునే ఆలోచన వారికి ఏమాత్రం లేనట్లే తోస్తున్నది.  మరి లాక్ డౌన్ ను కొనసాగిస్తూ  ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి?  కష్టపడి పనిచేసుకుని పొట్ట పోసుకునేవారికి రేషన్, కూరలు, నిత్యావసరాలు, డబ్బులు ఇస్తూ ఎన్నాళ్లని భరించగలరు?  
 
మొన్ననే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ రాజన్ , ఇంకా అనేకమంది ఆర్థికవేత్తలు, దేశాధినేతలు లాక్ డౌన్ ను ఎక్కువకాలం కొనసాగించడం మంచిది కాదని సూచిస్తున్నారు.  ఇలాగే లాక్ డౌన్ కొనసాగితే ఆకలి చావులు మొదలవుతాయని, ప్రజలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారని నారాయణమూర్తి హెచ్చరిస్తున్నారు.  అలాగే జర్మనీ ఛాన్సలర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు కూడా కరోనాను  మన జీవితంలో ఒక భాగంగా స్వీకరించక తప్పదని, దానితో సహజీవనం అనివార్యమని  ప్రకటిస్తున్నారు.  కరోనా భయంతో దేశాన్ని లాక్ చేసుకుంటే ఆర్థికరంగం కుప్పకూలి పోవడమే కాకుండా, ప్రజల్లో కూడా ప్రభుత్వ శాసనధిక్కారం, చట్టాల ఉల్లంఘన వంటి స్వభావం చోటు చేసుకుంటుందని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు.  
 
ఇక మోడీ లాక్ డౌన్ ను ప్రకటించిన విధానం చూస్తే పెద్దనోట్లు రద్దు చేసిన సంఘటనే  గుర్తుకొస్తుంది.   కనీసం తన మంత్రులకు కూడా చెప్పకుండా నేరుగా టీవీ స్టేషన్ కు వెళ్లి నోట్ల రద్దును ప్రకటించడంతో ప్రజల్లో అల్లకల్లోలం చెలరేగింది.  తమదగ్గరున్న పాత నోట్లను మార్చుకోవడానికి ప్రజలు నానా అగచాట్లు పడ్డారు.  దేశం మొత్తం బ్యాంకులముందు, ఏటీఎం ల ముందు బారులు తీరింది.  సుమారు నూటయాభై మంది క్యూలలో నిలుచుని ప్రాణాలు కోల్పోయారు.  ఆ దుస్సంఘటనకు కనీసం విచారం కూడా వ్యక్తం చెయ్యలేదు మోడీ.  మోడీ ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు సరికదా…అనేక వ్యాపార రంగాలు దెబ్బతిని దేశం కుదేలైపోయింది.  జీడీపీ సగానికి సగం తగ్గిపోయింది. 
 
మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిని అనుసరించారు మోడీ.    లక్షలాది వలస కార్మికులు దేశంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకుని పోయారన్న కనీస ఆలోచన కూడా లేకుండా, వారందరినీ స్వస్థలాలకు చేర్చి ఆ తరువాత లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుండేదన్న విమర్శలు ఈనాటికీ వినిపిస్తున్నాయి.    మోడీ అసంబద్ధ నిర్ణయం కారణంగా  అయిదు వారాల పాటు  లక్షలమంది వలసకార్మికులు నరకయాతన పడ్డారు.  తిండి లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, కాలకృత్యాలు తీర్చుకునే సదుపాయాలు లేక నానా కష్టాలు అనుభవించారు.  కొందరైతే మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని తమ స్వగ్రామాలకు కాలినడకన వెళ్లారు.  వారిలో కొందరు దారిలో ప్రాణాలు కోల్పోయారు.  మరికొందరు తమ గ్రామాలకు వెళ్లీ కూడా గ్రామాల్లోకి రానీయకపోవడంతో దిక్కుతోచక అల్లాడిపోయారు. 
 
నాలుగు రోజులపాటు వారందరినీ రైళ్లలోనో, బస్సుల్లోనే, లారీల్లోనో స్వగ్రామాలకు చేర్చిన తరువాత లాక్ డౌన్ ప్రకటించి ఉన్నట్లయితే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కావని రాజకీయ పరిశీలకులతో పాటు సామాన్య పరిజ్ఞానం ఉన్నవారు కూడా అభిప్రాయపడుతున్నారు.  అయిదు వారాల తరువాత హడావిడిగా వలసకార్మికులను తమ స్వగ్రామాలకు వెళ్ళడానికి అనుమతించడం చాలామందిలో భయాన్ని కలిగిస్తున్నది.  వీరిలో ఎందరికి పాజిటివ్ ఉన్నదో తెలియదు.  వీరిద్వారా మళ్ళీ వైరస్ వ్యాప్తి చెందుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు.  
 
ప్రస్తుత దేశ పరిస్థితులను చూస్తుంటే లాక్ డౌన్ ను ఎక్కువకాలం కొనసాగించడం మంచిది కాదనిపిస్తున్నది.  వైరస్ ప్రభావం లేని జిల్లాల్లో, ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు అనుమతించడం అవసరం.  ఇక స్వీయనియంత్రణ పాటిస్తూ ఎవరి పనులు వారు చేసుకోవడానికి అంగీకరించాలి.  కొన్నాళ్లపాటు ప్రభుత్వం ఈ కార్యకలాపాలు సాగుతున్న తీరును పర్యవేక్షించాలి.  ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం శ్రేయస్కరం.  ముందుగా చిరువ్యాపారులను అనుమతించి,  వైరస్ ప్రభావం పెద్దగా కనిపించకపోతే, ఆ తరువాత పరిశ్రమలు, మాల్స్ ను కూడా వ్యాపార కార్యకలాపాలకు అనుమతించవచ్చు.  ఎందుకంటే, కరోనా వైరస్ అనేది ఇప్పట్లో పోదు అనే సత్యం తెలిసింది కాబట్టి.  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు