ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇవాళ(బుధవారం) మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘మా వందే’ అనే పేరును పెట్టారు. ఈ మూవీలో మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించనున్నారు. ఈమేరకు మూవీ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఉన్నికృష్ణన్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీలో మోహన్ లాల్ కుమారుడిగా, తారక్ తమ్ముడిగా నటించారు. అలాగే అనుష్క నటించిన భాగమతి సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్లు తెలిపారు.
సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి ఎం. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రాంతి కుమార్. సిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. గుజారత్‌లో టీ అమ్మే స్థాయి నుంచి దేశ ప్రధాని వరకు ఆయన జీవిత ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. అలాగే మోదీకి తన తల్లి హీరాబెన్‌తో ఉన్న అనుబంధాన్ని హృద్యంగా చూపించబోతున్నామని పేర్కొన్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు బాహుబలి, మగధీర, ఈగ వంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీగా పనిచేయనున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్, సలార్ లాంటి భారీ సినిమాలకు పనిచేసిన రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ టెక్నీషియన్స్, నటులు పనిచేస్తున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ జీవితంగా గురించి తెలియాలనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్ భాషలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

