విశాఖపట్నంలోని కీలక నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో ఇది మరింతగా మారుమోగింది. అయితే ఈ హాట్ సీట్ లో గాజువాక ఓటర్లు పవన్ కు హ్యాండ్ ఇచ్చారు! ఈ సమయంలో గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని ఓడించిన వైసీపీ అభ్యర్థి స్థానంలో ఈసారి మంత్రి అమర్నాథ్ బరిలోకి దిగుతున్నారు. అతనికి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి పల్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.
వాస్తవానికి గాజువాక ప్రజలు గత ఎన్నికల్లో పవన్ ని ఓడించడానికి “లోకల్” ఫీలింగ్ కూడా ఒక కారణం అని అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే.. ఈసారి వైసీపీ అభ్యర్థిగా అమర్నాథ్ – టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్ల శ్రీనివాస్ లు ఇద్దరూ లోకల్ అభ్యర్థులే కావడంతో… లోకల్ అనే టాపిక్ ఈసారి లేదు! అయితే విశాఖ ఉక్కు పరిశ్రమ ఈ నియోజకవర్గ పరిధిలోకే రానుండటంతో… కూటమికి పెద్ద సమస్య ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం కూటమిలో బీజేపీ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో… వైజా స్టీల్ ప్లాంట్ విషయమంలో రాష్ట్ర ప్రజలకు స్పష్టత.. కనీసం గాజువాక ప్రజానికైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనాఉంది. ఈ విషయంలో బీజేపీ పెద్దలతో… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పై సరైన క్లారిటీ ఇప్పించగలిగాలి. అలా కానిపక్షంలో అమర్నాథ్ కి ఆ పాయింట్ చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు.
గాజువాక ఏ పార్టీకి కంచుకోట కాదనే చెప్పాలి! ఇక్కడ అభ్యర్థి.. వారి కాండక్ట్.. ఆయన పోటీచేసే పార్టీ.. మొదలైన విషయలనే పరిగణలోకి తీసుకుంటారు తప్ప… ఫలానా పార్టీ కాబట్టి గంప గుత్తగా ఓట్లు గుద్దేద్దామని గాజువాక ప్రజానికం భావించదు. 2009లో పీఆర్పీ నుంచి చింతలపూడి వెంకటరామయ్యను గెలిపించిన గాజువాక ఓటర్లు.. 2014లో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస రావుని గెలిపించారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసినప్పటికీ… వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి పట్టం కట్టారు.
ఇక సామాజిక వర్గాల విషయానికొస్తే… ఇక్కడ ప్రధానంగా యాదవ, కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రధానంగా ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన వారికే పార్టీలు టిక్కెట్లు ఇస్తుంటాయి. ఇదే సమయంలో… గవర, వెలమ, రెడ్డిక వంటి బీసీ కులాలు కూడా సుమారు ఇరవై వేల చొప్పున ఓటింగ్ ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2009లో పీఆర్పీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి గెలిచిన పరిస్థితి!
ఇదే క్రమంలో… 2014లో యాదవ సామాజికవర్గ నేత పల్లా శ్రీనివాస్ గెలవగా.. 2019లో వైసీపీ – జనసేన హోరాహోరీ పోరులో టీడీపీ భారీగా ఓట్లు చీల్చడంతో నాగిరెడ్డి గెలిచారు. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే ఇక్కడ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పల్లా శ్రీనివాస్ ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. మరోపక్క గుడివాడ అమర్నాథ్ గాజువాకలో పోటీ చేయడం ఇదే తొలిసారి.
ఇక తన తండ్రి గురునాథరావు మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథ్… తొలుత టీడీపీ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా.. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం… రాష్ట్ర క్యాబినెట్ లోనూ చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు అనుహ్యంగా గాజువాక టికెట్ దక్కించుకుని.. తనను ఆదరించాలంటూ ప్రచారంలో దుసుకుపోతున్నారు.
ఇక టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓటమి తరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా, నియోజకవర్గంపైనా స్పష్టమైన ముద్ర వేశారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నా పల్లా శ్రీనివాసరావు.. ఈసారి గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలో జోరు చూపుతున్నారు! దీంతో.. ఈసారి గాజువాక ప్రజలు ఫ్రెషర్ కి ఛాన్స్ ఇస్తారా.. ఎక్స్ పీరియన్స్ క్యాండిడేట్ కే పట్టంకడతారా అన్నది ఆసక్తిగా మారింది.