మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో దూకుడుగా వెళుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో బ్రేకులు పడ్డ సంగతి తెలిసిందే. శాసన సభలో ఆమోదం, మండలిలో రభస అనంతరం గవర్నర్ సంతకంతో మూడు రాజధానుల శాసన ప్రక్రియ పూర్తైనట్టేనని భావించిన అధికార పక్షం ఆగష్టు 15 నాడు సీఎం విశాఖ నుండి అధికారికంగా పాలన మొదలుపెడతారని ప్రకటించింది. కానీ గవర్నర్ గెజిట్ మీద హైకోర్టు స్టేటస్ కో నోటీసులు జారీ చేయడంతో పాలనా విభాగాల తరలింపుకు అడ్డంకి ఏర్పడింది. ఇంకో 10 రోజుల పాటు తరలింపు పనులేవీ జరగడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈలోపు ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. ఇకపై ఎవరూ రాజధాని మార్పును అడ్డుకోలేరని పాలక పక్షం సంబరపడుతున్న పక్షంలో హైకోర్టు మోకాలడ్డటంతో కొత్త ట్విస్ట్ మొదలైంది.
అసలే ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగిలి ఉన్నాయి. పంచాయతీ కార్యాలయాలకు రంగుల తొలగింపు, ఈసీగా నిమ్మగడ్డ నియామకం వంటి తీర్పులతో హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. మళ్లీ రాజధాని కేసులో స్టే ఇవ్వడంతో ఈ కేసు కూడా అలాగే అవుతుందని కొందరు అంటున్నారు. కానీ వాస్తవాలు చూస్తే కేసులో ప్రభుత్వానికే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 14న, ఆ తర్వాత జరగబోయే విచారణల్లో ప్రభుత్వం తన ఆయుధాలన్నింటినీ బయటకు తీస్తుంది. ప్రతిపక్షాలు చెబుతున్నట్టు విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంది, రాజధానులు అని లేదు, సెలెక్ట్ కమిటీలో విషయం నానుతోంది వంటి అంశాలేవీ పనిచేయకపోవచ్చు.
విభజన చట్టం మేరకు రాజధానులు కాదు రాజధాని ఉండటాలని అన్నా ప్రభుత్వం రాజధాని ఒక్కటేనని, కానీ సౌలభ్యం కోసం వ్యవస్థలను వేరు వేరు చోట్ల ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి బయటపడే ఆస్కారముంది. అలాగే కోర్టుల్లో ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా లాంటి రాజకీయపరమైన ప్రశ్నలు కూడా నిలబడవు. ఎందుకంటే కోర్టులు రాజకీయపరమైన అస్సలు పట్టించుకోవు. మరి ఏం చేస్తే సర్కారును దారిలోకి తెచ్చుకోవచ్చు అంటే అది రైతుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనేది విశ్లేషకుల మాట. అవును.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు రాజధాని అనే సెంటిమెంట్ మీద కాకుండా, వైసీపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నట్టు కాకుండా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల మీద పోరాడితే ఫలితం కనిపించవచ్చట.
ఎందుకంటే అప్పుడు ఇప్పుడు పార్టీలు మారాయి తప్ప ప్రభుత్వం ఒక్కటే. రైతులు ఆనాడు భూములు ఇచ్చింది కూడా ప్రభుత్వానికే తప్ప తెలుగుదేశం పార్టీకి కాదు. ఆనాడు భూసేకరణ చేసేప్పుడు చాలామంది రైతులు మూడు పంటకు పండే భూములను ఇవ్వడానికి నిరాకరించారు. ప్రభుత్వంతో వ్యవహారం తలనొప్పని వెనకడుగు వేశారు. దాంతో ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించేలా కొన్ని హామీలను ఇచ్చింది. భూములిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరిస్తే ఆ భూముల ధరలకు తగ్గట్టు ప్రత్యామ్నాయాలు చూపుతామని, పలు రకాలుగా న్యాయం చేస్తామని హామీలు ఇచ్చింది. ఆ హామీలే ఇప్పుడు రైతుల హక్కులయ్యాయి. రాజధాని తరలింపుతో ఆ హక్కులకు భంగం కలుగుతుందని రైతులు పోరాడవచ్చు.
ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఉన్నంత మేలు ఈనాడు రాజధానిని మూడుగా విభజించండం వలన పోయిందని తమకు కలిగే నష్టాన్ని వివరించుకోవచ్చు. మరోవైపు వైసీపీ నేతలు పూర్తి రాజధాని లేకపోయినా రైతులిచ్చిన భూములను అన్ని విధాలా అభివృద్దిపరుస్తామని అంటున్నారు. కానీ రాజధాని అమరావతి అనే పేరు మీద జరిగే అభివృద్దికి, ఒట్టి అమరావతి అనే పేరు మీద జరిగే అభివృద్దికి చాలా తేడా ఉంటుంది. పేరుకి శాసన రాజధానే అయినా పాలన రాజధానిలోని అభివృద్దికి ఉన్న విలువ ఉండదు. ఇది ప్రభుత్వం రాజధాని అభివృద్ది ద్వారా చేకూరుస్తామన్న లబ్దికి గండి కొట్టడమే అవుతుంది. కాబట్టి రైతులు ఈ హక్కుల విషయమై హైకోర్టులో పోరాడితే న్యాయం జరిగే ఛాన్సుంది. పూర్తి రాజధాని అమరావతిలోనే ఉన్నా లేకున్నా భూములు ఇచ్చేటప్పుడు రైతులు ఏయే ప్రయోజనాలు దక్కుతాయని ఆశించారో అవి దక్కే అవకాశముంది.