ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల పంచాయితీ మళ్ళీ తెరపైకొచ్చింది. ‘మేమెందుకు ముందస్తు ఎన్నికలకు వెళతాం.?’ అంటూ పదే పదే వైసీపీ చెబుతున్నా, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధికార వైసీపీ తొందర పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్లో ఏ క్షణాన అయినా, ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన సంకేతాలు ఇస్తారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలసిందే. కానీ, ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండిస్తూ వచ్చింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెలలో ముందస్తు ఎన్నికలపై వైసీపీ నుంచి స్పష్టత రాబోతోందన్నది తాజా ఖబర్.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు వైసీపీకి రుచించడంలేదు. మారిన సమీకరణాలు విపక్షాలకు బలం చేకూర్చుతున్నాయని వైసీపీ బలంగా విశ్వసిస్తున్నా పైకి ఒప్పుకోలేని పరిస్థితి. ప్రస్తుతానికి టీడీపీ – జనసేన మధ్య ‘నిప్పు – ఉప్పు’ అన్నట్లు గొడవ కనిపిస్తోంది. ఇంకోపక్క, ఆ రెండు పార్టీల్ని కలిపేందుకు వామపక్షాలూ రంగంలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి, విపక్షాలకు తగిన సమయం లేకుండా చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి బ్యాక్ టు బ్యాక్ ఢిల్లీ పర్యటనల వెనుక కూడా ముందస్తు ఎన్నికల మర్మం వుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ప్రత్యేక హోదా సహా కీలక అంశాలపై తాడో పేడో తేల్చుకుని, వాటిని ప్రజా క్షేత్రంలోనూ పెట్టాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట.