దేశంలోనే గతంలో కనీవినీ ఎరుగని రాజ్యాంగపరమైన వివాదాలకు, రెండు బలమైన వ్యవస్థలకు మధ్యన ఘర్షణపూర్వకమైన వాతావరణం నెలకొన్నది. ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని సామాన్యులు నిర్ణయించలేరు. దాన్ని అధికారికంగా తేల్చాల్సింది గారవనీయమైన న్యాయస్థానాలే. కానీ, ఆ న్యాయస్థానాలు కూడా బాధ్యతతో వ్యవహరిస్తున్నాయా అనే అది కూడా చెప్పలేము. ఎన్నికలు జరిపించాలన్న ఎన్నికల కమీషన్ ఆదేశాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని హైకోర్టు సింగల్ జడ్జ్ కొట్టేశారు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ అదే కోర్టులో అపీల్ కు వెళ్లారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిమ్మగడ్డను సమర్ధించింది. ఎన్నికలు జరపాలని ఆదేశించింది. మరి ఒకే కోర్టులో రెండు రకాల తీర్పులు వచ్చినపుడు ఆ న్యాయమూర్తులలో ఎవరు కరెక్టని మనం భావించాలి? తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై నిమ్మగడ్డ అపీల్ కు వెళ్ళినపుడు, తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో తప్పేముంది? అక్కడ వారు ఎలాంటి తీర్పు చెబుతారో చూడాల్సిన అవసరం నిమ్మగడ్డకు లేదా? తాను అవకాశాన్ని తీసుకున్నట్లే ప్రభుత్వం కూడా అవకాశం తీసుకుంటుంది కదా? సుప్రీంకోర్టు కూడా నిమ్మగడ్డనే సమర్ధిస్తే అప్పుడు ప్రభుత్వం చేయగలిగేది ఏమీ ఉండదు. మరో రెండు రోజులపాటు నిమ్మగడ్డ ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారు?
నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శిస్తున్న కోర్టులు
ఇక సుప్రీంకోర్టు సంగతి చూద్దాం. ప్రభుత్వరంగంలోని ఏ వ్యవస్థలైనా ఇరవైనాలుగు గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ వ్యస్థనైనా అర్ధరాత్రివేళనైనా తలుపుతట్టి పిలిచి న్యాయం చెయ్యమని అర్ధించే హక్కు ఈ దేశ పౌరులకు ఉంటుంది. కరుడుగట్టిన ఉగ్రవాదుల పిటీషన్లు సైతం తెల్లవారుజామున, అర్ధరాత్రి కూడా కోర్టులు విచారించిన సందర్భాలున్నాయి. మరి అయిదుకోట్లమందికి ప్రతినిధి అయినట్టి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే “కోర్టు సమయం అయిపోయిందంటూ” దాటవేయడం ఏమిటి? ఒకవైపు రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థలు తీవ్రస్థాయిలో ఘర్షించుకుంటున్న సమయంలో, మరికొద్ది గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సందర్భంలో దానిని ఆపమని ప్రభుత్వమే తన గడప తొక్కినపుడు మరొక గంటసేపు సమయం కేటాయించి విచారించి తెల్చిపారేస్తే కనీసం ఆ రెండు వ్యవస్థలమధ్య నెలకొన్న సంక్షోభం నివారించబడుతుంది కదా? “కోర్ట్ సమయం అయిపోయింది” అని ప్రభుత్వమొరను వినడానికి నిరాకరించడం అంటే అయిదు కోట్లమంది ప్రజలను అవమానించడమే కాదా? వ్యవస్థల మధ్య కొట్లాటను తమాషాగా చూడటం కాదా?
ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా?
ఇక రాజ్యాంగ సంక్షోభం అంటున్నారు. ఇలాంటి వాతావరణాన్ని గతంలో ఎవ్వరూ చూడకపోవడంతో ఆ రాజ్యాంగ సంక్షోభం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో ఎవ్వరికీ అనుభవంలోకి రాలేదు. ఏవిధమైన శాసనాధికారాలు లేని పంచాయితీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరగకపోతే వచ్చే నష్టం ఏమైనా ఉన్నదా? గతంలో పంచాయితీ ఎన్నికలు దశాబ్దాలపాటు జరగకపోయినా రాజ్యాంగానికి ఏదైనా ద్రోహం జరిగిందా? ప్రభుత్వం కానీ, రాజ్యాంగం కానీ సంక్షోభంలో కూరుకుని పోయాయా? ప్రభుత్వం చెబుతున్నవి కుంటిసాకులు అని అనుకుందాం. వారు చెప్పిన కారణాలు కనిపిస్తున్నాయి కదా? వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది కదా? వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండూ ముఖ్యమే అని హైకోర్టు వ్యాఖ్యానించడంలో ఏమైనా ఔచిత్యం ఉన్నదా? వ్యాక్సినేషన్, ఎన్నికలు ఈ రెండు ప్రక్రియల్లో పాల్గొనేది ప్రభుత్వ ఉద్యోగులే. వారికి వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పుడు, వారు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నపుడు ఏకకాలంలో రెండు విధులను ఎలా నిర్వహిస్తారు? ప్రజారోగ్యం ముఖ్యమని సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులు ఏ విధంగా బేఖాతరు చేస్తారు? రేపు జరగరానిదేమైనా జరిగితే ఎన్నికల కమీషన్ బాధ్యత తీసుకుంటుందా లేక హైకోర్టు, సుప్రీంకోర్టు తీసుకుంటాయా?
నిమ్మగడ్డ ప్రవర్తన అనుమానాస్పదం
ప్రభుత్వం అసలు ఎన్నికలు వద్దనలేదు. గత మార్చ్ లో ఎన్నికలకు వెళ్ళింది. కానీ, అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో సంప్రదించకుండా కరోనా సాకుతో ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటినుంచి రెండు వ్యవస్థలమధ్య ఘర్షణ మొదలైంది. ఆ తరువాత నిమ్మగడ్డ హైద్రాబాద్ లోని ఒక స్టార్ హోటల్లో మాజీ తెలుగుదేశం నాయకులు కొందరిని రహస్యంగా కలిశారు. అప్పటినుంచే ఆయన నిజాయితీ పట్ల ప్రభుత్వానికి శంకలు మొదలయ్యాయి. నిమ్మగడ్డ ప్రవర్తన కూడా అలాగే ఉన్నది. విచిత్రం ఏమిటంటే ఏ దశలోనూ 2018 లో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఎన్నికలు ఎందుకు జరపలేదని, తెలుగుదేశం నాయకులతో రహస్యంగా ఎందుకు సమావేశమయ్యారని కానీ కోర్టులు ప్రశ్నించకపోవడం! రాజ్యాంగం ప్రకారం నిర్ణీత సమయానికి ఎన్నికలు జరుపుతారా లేక మీ ఇష్టం వచ్చినపుడు జరుపుతారా అని ఎన్నికల కమీషనర్ ను కోర్టులు నిలదీయకపోవడం ఏమిటి?
ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా?
ఇక కొంతమంది మేధావులైతే జగన్మోహన్ రెడ్డి మొండిగా పోతున్నాడని, రాజ్యాంగసంక్షోభానికి దారి చూపిస్తున్నాడని విమర్శిస్తున్నారు. తన ధోరణి వలన పరిణామాలు ఎలా ఉంటాయో జగన్మోహన్ రెడ్డికి తెలియదనుకోవడం వెర్రితనం మాత్రమే. రాజ్యాంగసంక్షోభం ఏర్పడితే ఏమవుతుంది? జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? చెయ్యనివ్వండి. జైల్లో పెడతారా? పెట్టనివ్వండి. రాష్ట్రపతి పాలన పెట్టినా ఆరు నెలల తరువాత ఎన్నికలు పెట్టక తప్పదు కదా? అప్పుడు జగన్ 170 సీట్లతో అధికారంలోకి వస్తారు. లేకపోతె 90 సీట్లతో గెలుస్తారు. ఎన్ని వచ్చినా మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని అడ్డుకోగలరా? అప్పుడు ఏమి చేస్తారు? అన్ని వ్యవస్థలు జగన్ మీద యుద్ధం చేస్తున్నాయని ఇప్పటికే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. వారి అనుమానాలు మరింత బలపడటం తప్ప మరే ప్రయోజనమూ లేదు. తనమీద కత్తులు నూరుతున్న వ్యవస్థలపై జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం భయపడకుండా ఒంటరిపోరాటం చేస్తున్నారని ఇప్పటికే ఆయన మీద హీరో ఇమేజ్ ఏర్పడింది. అది ఇంకా పెరుగుతుంది.
ఇక ప్రజాప్రభుత్వాలు దేనికి?
రేవు సోమవారం సుప్రీమ్ కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఎన్నికలు తమ అభిమతం ప్రకారం జరగాలని కోరుకోవడంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టలేము. అయిదు కోట్లమందికి జవాబు చెప్పుకోవలసిన ప్రభుత్వం మాట కన్నా, ఎవరికీ జవాబుదారీ కాని ఒక రిటైర్ అయిన అధికారి మాటే చెల్లుబాటు అయ్యేట్లయితే దాన్ని ప్రజాస్వామ్యం అనలేము. అలాంటి ప్రజాస్వామ్యం వృధా. అలాంటపుడు ప్రభుత్వాన్ని కూడా ఒక కమీషన్ గా ప్రకటించి దానికి ఒక ఐఏఎస్ అధికారిని కమీషనర్ గా నియమించే విధంగా రాజ్యాంగాన్ని సవరిస్తే వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడుకోవచ్చు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు