BRS: మరో బీఆర్‌ఎస్‌ నేత యూటర్న్? ఆ పొగడ్తల వెనుక ఏదో ఉంది!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరే హాట్ టాపిక్. ఎప్పుడూ బీఆర్‌ఎస్‌కు నిష్టతో ఉంటూ, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ఆయన.. ఇటీవల తన మాటలతో రాజకీయ వర్గాల్లో హడావుడి పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచేసిన ప్రభాకర్ రెడ్డి, ఇక తన పార్టీ బీఆర్ఎస్‌పైనే విమర్శలు చేయడం గమనార్హం.

కొత్త సంవత్సర ప్రారంభంలో ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త, దుబ్బాక అభివృద్ధిపై నిధులు కోరారు. సీఎం వెంటనే స్పందించి నిధులు కేటాయించడంతో ఆయన్ను అభినందించారు. ఇదే సందర్భంలో దుబ్బాకకు గతంలో నిధులు రాలేదని, బీఆర్ఎస్ హయాంలోనూ అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి.

ఇప్పటికే పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా కొత్త, మాణిక్ రావు, సునీతా రెడ్డి వంటి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇప్పుడు ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే… ఆయన ఆలోచనలు మారుతున్నాయన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

కొత్త ప్రభాకర్ రెడ్డి నిజానికి వివాదాలకంతా దూరంగా ఉండే నేత. వ్యాపారవేత్తగా ఉన్నా, అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్‌పై విమర్శలు, కాంగ్రెస్‌పై పొగడ్తలు వల్ల ఆయన వైఖరి పట్ల అనుమానాలు బలపడుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమా? లేక రాజకీయ మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారా? అన్నది త్వరలో తేలనుంది.