20 కోట్లు పెడితే.. ఆ సినిమాకు వచ్చింది 5 కోట్లే..

Kingston: కోలీవుడ్ లో హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రేజ్ ఉన్న జీవీ ప్రకాశ్ కుమార్ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ‘కింగ్‌స్టన్’ అనే ఫాంటసీ హారర్ కథతో నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. కమల్ ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలోకి వచ్చి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో లక్ ను పరీక్షించబోతోంది.

20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం 5.35 కోట్లే రాబట్టడంతో నిర్మాతలకి భారీ నష్టం వాటిల్లింది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కలెక్టబుల్స్ కాన్సెప్ట్, విజువల్ ప్రెజెంటేషన్ ఆకట్టుకుంటే మంచి రెస్పాన్స్ రావొచ్చు. తాజా సమాచారం మేరకు, ‘కింగ్‌స్టన్’ మూవీ ఏప్రిల్ 4 నుంచి ‘జీ5’ ఓటీటీ వేదికగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించకపోయినా, ఓటీటీ ద్వారా విభిన్న కథల్ని కోరుకునే ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. జీవీ ప్రకాశ్‌తో పాటు దివ్యభారతి, నితిన్ సత్య, అళగమ్ పెరుమాళ్, చేతన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కథ విషయానికొస్తే, ఇది సముద్రతీరంలో ఉన్న జాలర్ల గ్రామం చుట్టూ తిరుగుతుంది. అక్కడ చేపల వేటకి వెళ్లినవాళ్లు మళ్ళీ తిరిగి రారు. గ్రామస్థులు దీని వెనుక ఓ ఆత్మ కారణమని నమ్ముతున్నారు. అదే నిజమా? అనే సందేహంతో ఆ గ్రామాన్ని కాపాడేందుకు హీరో ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ఎదురయ్యే అడ్డంకులు, మిస్టీరియస్ టచ్ కథలో ఆసక్తిని కలిగిస్తాయి. విజువల్స్, నేపథ్య సంగీతం బాగున్నా.. థియేటర్లో మాత్రం మాజిక్ చేయలేకపోయింది.