Nagababu: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శాసనమండలిలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ నుంచి నాగబాబు ఎంపిక అయ్యారు. ఇక ఈయనని ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు.
కొణిదేల నాగబాబు, బీజేపీ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరు నేతలతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా నాగబాబు శాసనమండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
ఈ విధంగా నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన భార్యతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు నాయుడుని కలిసిన అనంతరం పుష్పగుచ్చం అందజేసి పలు విషయాల గురించి నాగబాబు మాట్లాడినట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా, నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.
నాగబాబు దగ్గర బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి రూ.59 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు రూ.55.37 కోట్లు, చేతిలో నగదు రూ.21.81 లక్షలు, బ్యాంకు నిల్వలు రూ.23.53 లక్షలు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.03 కోట్లు ఉన్నాయి. బెంజ్ కారు విలువ రూ.67.28 లక్షలు, హ్యుందాయ్ కారు రూ.11.04 లక్షలు విలువ ఉన్నట్టు తెలిపారు.
బంగారం, వెండి రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు), హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు, పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు అఫిడవిట్ సమయంలో ప్రకటించారు. ఇదే కాకుండా, బ్యాంక్ హౌసింగ్ లోన్ రూ.56.97 లక్షలు, కారు రుణం రూ.7.54 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు.