జగన్ గెలుపును కన్ఫాం చేసేసిన బాబు!

మహానాడు వేదికగా టీడీపీ నేతలు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు అపహాస్యం పాలయ్యారు! ఏ పథకాలు పేరు చెప్పి జగన్ ను తిట్టిపోశారో అదే పథకాలకు పేర్లు మార్చి చంద్రబాబు తన మొదటి విడత మేనిఫెస్టోని విడుదల చేశారు! త‌న రాజ‌కీయ అనుభ‌వమంత వ‌య‌సు లేద‌ని జ‌గ‌న్‌ ను ప‌దేప‌దే త‌ప్పు ప‌ట్టే చంద్రబాబు… ఎన్నిక‌ల వేళ జగన్ సంక్షేమ రూట్‌ లోనే ప్రయాణించడంపై సెటైర్లు పేలుతున్నాయి.

వైఎస్ జ‌గ‌న్.. త‌న‌ది సంక్షేమ బాట అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించారు. ఇంత కాలం వైఎస్ జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌ను త‌ప్పు ప‌డుతూ వ‌చ్చిన బాబు, తాజాగా జగన్ కంటే ఎక్కువ ల‌బ్ధి క‌లిగిస్తానని చెప్పుకొచ్చారు. “భవిష్యత్‌కు గ్యారెంటీ” అనే నామకరణం చేసిన ఈ మేనిఫెస్టోను ప్రజలు నమ్మితేనే “టీడీపీ భవిష్యత్తుకు ఎంతో కొంత గ్యారెంటీ” దొరుకుతుందని బలంగా నమ్ముతున్న తమ్ముళ్లు సైతం ఈ మేనిఫెస్టో చూసి పెదవి విరుస్తున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని సైతం బాబు కలిపేసుకున్నారు. కాపీ పేస్ట్ బ్యాచ్ కి మేనిఫెస్టో రూపకర్తల టీం అని పేరు పెట్టుకున్న చంద్రబాబు… జగన్ “అమ్మ ఒడి” పథకాన్ని కాస్త “త‌ల్లికి వంద‌నం” అని మార్చారు. గతంలో వైఎస్సార్ “ఉచిత విద్యుత్” అని ప్రకటించిన కొత్తలో కరెంట్ తీగెలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన చంద్రబాబు… తర్వాత ఎన్నికల్లో “ఉచిత విద్యుత్” తానుకూడా ఇస్తానని చెప్పుకుని నవ్వులపాలయిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు విశ్లేషకులు!

ఇదే క్రమంలో 2014 ఎన్నిక‌ల ముందు చంద్రబాబు ఏకంగా 600 హామీలతో మేనిఫెస్టో రూపొందించారు. రైతుల రుణ‌మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి అంద‌జేస్తామ‌ని బలంగా చెప్పారు.. జనం నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ఎప్పటిలాగానే బాబు నిలబెట్టుకోలేదు. ఫలితంగా 2019లో బాబును 23 సీట్లకే ప‌రిమితం చేశారు. 2019లో జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకొచ్చారు. వాటి అమలులో చిత్తశుద్ధిని చూపించారు.

విచిత్రం ఏమిటంటే… జనాలకు డబ్బులు పంచుతున్నాడు.. అడ్డగోలుగా అమ్మ ఒడి అంటూ డబ్బులు తగలేస్తున్నాడు.. ఎవరి పిల్లలను వారు చదివించుకోలేరా అన్నట్లుగా వ్యంగ్యంగా మాట్లాడిన టీడీపీ నేతలు, చేపలు పంచడం కాదు – పట్టడం నేర్పాలని కబురులు చెప్పిన వారి అనుకూల మీడియా… ఇప్పుడు ఆ పథకానికి పేరు మార్చి వాడేసుకుంటుంది. దీన్ని కూడా సమర్థిస్తే… వారే టీడీపీ పథనానికి కారణకులు అనే కామెంట్లు వినిపిస్తుండటం కొసమెరుపు!