5.4 ల‌క్షల కోట్ల రుణ ప్రణాళిక… సంపద సృష్టించే పనిలో బాబు!!

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కంటే.. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని చెప్పే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా శ్వేతపత్రాల మాటున బాబు… “ఇప్పట్లో కాదు.. టైం పడుతుంది” అని తన ఎన్నికల హామీల అమలును పోస్ట్ పోన్ చేయడం, స్లోగా జనం మరిచిపోయేలా చేయడం వంటివి చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

ఈ సందర్భంగా… జగన్ సర్కార్ హయాంలో అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేశారని.. ప్రజలకు డబ్బులు పంచేశారని.. సంక్షేమ పథకాల అమలు వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని.. తాను అధికారంలోకి వస్తే అంతకు మించి సంక్షేమం ఇస్తామని.. కాకపోతే తాము సంపద సృష్టించి ఇస్తామని బాబు వెల్లడించారు. ఏపీ ప్రజానికం నమ్మారు. ఈ నేపథ్యంలో సంపద సృష్టించే వరకూ సూపర్ సిక్స్ అమలు కాదేమో అనే అనుమానం పలువురు తెరపైకి తెచ్చారు.

అయితే అలాంటి అనుమానాలేమీ వద్దని చంద్రబాబు చెప్పకనే చెప్పారు… ఆయన సుమారు 5.4 లక్షల కోట్ల రుణ ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఇది కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు త్రైమాసికాలకు ఈ 5.4 లక్షల కోట్లను అప్పుగా సమీకరించనుంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేవలం బ్యాంకులే ఇచ్చేలా చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేశారు.

ఈ క్రమంలో గతం జగన్ సర్కార్ చేసిన మొత్తాని కంటే 14 నుంచి 16 శాతం ఎక్కువగా లక్ష్యాలు పెట్టుకున్నట్లుగా ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ రూ. 5.4 లక్షల కోట్లలో విద్యుత్, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.3,75,500 కోట్లను కేటాయించారు.. ఇక మిగిలిన రూ.1,65,000 కోట్లను ఇతర రంగాలకు కేటాయిస్తూ ప్రణాళికలు రూపొందించారు.

మరోపక్క వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్ల అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం రుణాలు గతం కంటే 14 శాతం అధికంగా ఉండటం గమనార్హం. ఇదే క్రమంలో… “స్కిల్ డెవలప్మెంట్” కు చర్యలు తీసుకోవడంతో పాటు.. జీ.ఎస్.డీ.పీ పెంచే రంగాలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు.

అంటే… జగన్ సర్కార్ అప్పులు చేసి శ్రీలంకను చేస్తుందని, తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని, సంపద సృష్టించడమే తన లక్ష్యమని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారన్నమాట. పైగా గత ప్రభుత్వ హయాం కంటే 14 నుంచి 16 శాతం ఎక్కువగా ఆయన అప్పులు చేయాలని లక్ష్యంగా పెట్టుకొవడం గమనార్హం.