మింగడానికి మెతుకుల్లేవంటే, మీసాలకు శంపంగె నూనె కావాలన్నాడట వెనకటికి ఒకడు.! టీడీపీ – జనసేన కలిస్తే, ఇరు పార్టీల మధ్యా సీట్ల పంపకం సజావుగా జరిగి, ఓటు షేరింగ్ కూడా అత్యద్భుతంగా జరిగితే.. రెండు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం వుంది.
అలాగని, టీడీపీ – జనసేన కూటమికి అధికారంలోకి వచ్చినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హీనాతి హీనంగా ఓడిపోతుందా.? అంటే, అదీ లేదు.! వైసీపీకి గౌరవ ప్రదమైన సీట్లే రాబోతున్నాయ్.. ఒకవేళ టీడీపీ – జనసేన కూటమి వర్కవుట్ అయినాగానీ.!
టీడీపీ – జనసేన శ్రేణుల మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వుంటుంది. కులాల కుంపట్లనండీ, చంద్రబాబు నక్క జిత్తులనండీ, పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తిత్వం అనండీ.. కారణం ఏదైనా, టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చినా, నిలబడటం కష్టం.
కానీ, జనసేనాని మాత్రం టీడీపీ – జనసేన ప్రభుత్వం పదేళ్ళు కొనసాగాలని ఆకాంక్షించేస్తున్నారు. విభజన వల్ల, వైసీపీ పాలన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలంటే ఆ పదేళ్ళ సమయం అవసరమన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉవాచ. చెప్పడానికేం, ఇలాంటివి చాలానే చెప్పొచ్చు.
2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి జనసేనాని మద్దతిచ్చారు. కానీ, ఏం జరిగింది.? ప్రత్యేక హోదా రాలేదు. పోలవరం పూర్తవలేదు. రైల్వే జోన్ వచ్చింది లేదు. పవన్ కళ్యాణ్ ఏమన్నా నిలదీశారా.? అంటే, అదీ లేదు.
వైసీపీ హయాంలో కూడా ఏమీ జరగలేదు.! అసలు రాష్ట్రానికి జరగాల్సినవి జరిగే యోగం అయితే వున్నట్లు కనిపించడంలేదు.. బహుశా ఇది రాష్ట్రానికి శాపం అనుకోవాలేమో.! నిజమే, రాష్ట్రానికి ఏదో రాజకీయ శాపం వుంది.
నిలకడలేని రాజకీయం.. ఇదే రాష్ట్రానికి శాపం. ఆ నిలకడలేని రాజకీయానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్.!