ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గెలుపు అనివార్యం అయిన ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో టీడీపీలో కొత్త సమస్యలు దర్శనమిస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా బెజవాడ టీడీపీ నేతలు చంద్రబాబును చికాకు పెడుతున్నారని.. కొత్త టెన్షన్స్ పుట్టిస్తున్నారని అంటున్నారు. దీంతో చినబాబు లోకేష్ అగీమీద గుగ్గిలం అవుతున్నారంట.
అవును… బెజవాడ టీడీపీ నేతలపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. పేపర్లు, టీవీల్లో పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చే బడా నేతలు.. పార్టీకి అవసరమైనప్పుడు ముఖం చాటేస్తున్నారని బాబు ఫీలవుతున్నారంట. దీంతో… కీలకమైన కృష్ణా జిల్లాల్లో లీడర్ల వైఖరి కారణంగా ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నామని బాబు వాపోతున్నారంట.
ఇదే సమయంలో వీరి వైఖరి వల్ల, కలిసిరాలేకపోతున్న తత్వం వల్ల చివరికి లోకేశ్ యువగళం పాదయాత్ర కూడా కుదించుకోవాల్సివచ్చిందని టీడీపీ బాస్ అసంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంతటి కీలకమైన జిల్లాలో ముఖ్య నాయకుల తీరు చంద్రబాబుకు రుచించడం లేదని టాక్ వినిపిస్తోంది.
ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అంతా విజయవాడ వాసులే.. అంతేకాదు పార్టీ వాదనను బలంగా వినిపించే విషయంలోనూ వీరే ముందుంటారు. కానీ.. చంద్రబాబు మాత్రం గతకొంతకాలంగా వీరి పనితీరుపైనా, వ్యవహారశైలిపైనా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
మరోపక్క ఈ నెల 19న గుంటూరు నుంచి కృష్ణాజిల్లాలోకి అడుగుపెట్టనున్నారు లోకేశ్. అయితే ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ యువగళం యాత్ర 15 రోజుల పాటు నిర్వహించాలని అనుకున్నారు. కనీ.. బెజవాడ బ్యాచ్ వైఖరి కారణంగా కేవలం ఐదు రోజులకే పరిమితం చేసినట్లు చెబుతున్నారు.
అంతేకాదు లోకేశ్ యాత్ర మొత్తం ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సభ నిర్వహించగా.. కృష్ణా జిల్లాలో మాత్రం ఒక్క గన్నవరం సభతోనే సరిపెడుతున్నారని అంటున్నారు! దీంతో బెజవాడ టీడీపీ నేతల వైఖరి ఎఫెక్ట్ చినబాబు పాదయాత్రను సైతం తాకిందని అంటున్నారు. మరి ఎన్నికల నాటికి ఇలాంటి పరిస్థితులు ఇంకెన్ని చోట్ల ఎదురవుతాయనేది వేచి చూడాలి!