ఓ మహాత్మా.. ఓ మహర్షీ.. నీ విరచిత మహాభారతం.. మా”నవ” జీవితం.. మా ఇంగితం.. మా గతం.. యుగయుగాల మనిషి జీవనగీతం..!
వ్యాసుడు రాయని భారతమా.. వ్యాసుడు లేని భారతమా.. ప్రతి అక్షరం శిలాక్షరమై.. ప్రతి పర్వం మానవ జీవన సర్వమై.. సాక్షాత్తు దేవుని స్వరమై.. మండే భాస్వరమై..!
ఏమి రాసావయ్యా భారతం.. అన్నీ ఎప్పటికప్పుడు ఇప్పుడే జరుగుతున్నట్టు.. ప్రతి ఘట్టం కళ్లకు కట్టినట్టు.. ప్రతి పాత్ర కళ్ల ముందు కడలాడుతున్నట్టు.. నాడే కులకళంకసమాజ ప్రక్షాళన లక్ష్యమై.. ధర్మానిదే అంతిమ విజయమన్నది శాసనమై.. యుగం మారినా ఎప్పటికీ నవ్యంగా.. సవ్యాపసవ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నో ఘట్టాలకు అప్పుడే బీజాలు పడినట్టు.. ఇదంతా నీకు ముందే తెలిసినట్టు..!
అన్నట్టు.. నువ్వు తాదాత్యతతో ఇహం మరచి టకటకా చెబుతుంటే బొజ్జ గణపయ్య చకచకా రాశాడట మహాభారతం.. ఆదికావ్యం.. పంచమవేదం.. జగమునకెల్ల ముదం.. అమిత ఆమోదం..!
వేదవిభజన నీకే సంభవం.. అష్టాదశపురాణాలు నీ వల్లనే ఆవిర్భావం.. నీ విరచిత వ్యాససంహిత..వ్యాసస్మృతి సకల మానవాళికి చూపుతూ సద్గతి.. బ్రహ్మసూత్రాలు తొలి ఆర్ష గ్రంధమై.. భావ సుగంధమై.. వ్యాసుని బోధనలతోనే మానవ జీవితం క్రమబద్ధమై.. ప్రతి పథం ధర్మబద్ధమై.. కురుక్షేత్రమే ధర్మయుద్ధమై.. మరో యుగ జీవన విధానమూ భారతంలోనే ముందుగా సిద్ధమై..!
నువ్వు శ్రీమహావిష్ణువు పదిహేడో అవతారమై వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయవిష్ణవే.. నమోవై బ్రహ్మనిధయే.. వాసిష్టాయ నమోనమః..! కలదా ఇలను ఇంతకు మించిన కీర్తన.. నీ భజన.. నీకు నివేదన..!