ఆంధ్రులూ..ఆరు లక్షల కోట్ల అప్పును నెత్తిన వేసుకోవడానికి సిద్దం కండి 

Advisory committee requests YS Jagan 
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు తీరని నష్టం వాటిల్లిందని అందరికీ తెలుసు.  లోటు బడ్జెట్ తో  పుట్టిన నవ్యాంధ్రప్రదేశ్ కేంద్రం హ్యాండివ్వడంతో మరింత కుంగిపోయింది.  ఆదాయ వనరులు తక్కువగా ఉండటంతో అప్పుల మీదే ఎక్కువగా ఆధారాపడాల్సి వచ్చింది.  టీడీపీ ప్రభుత్వం తన హయాంలో సంక్షేమ పథకాల కోసం, పాలనా వ్యవయాల కోసం యేడాదికి సగటున 25,000 కోట్లకు పైగానే అప్పులు చేయాల్సి వచ్చింది.  టీడీపీ పాలనలో అంటే 2014 నుండి 2019 కాలంలో లక్ష కోట్లకు పైనే అప్పులు తెచ్చుకున్నాం మనం.  ఈ విషయాన్ని టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు స్వయంగా తెలిపారు.  బాబుగారు దిగిపోతూ లక్ష కోట్ల పైచిలుకు అప్పులు వదిలి వెళ్లారు.  వాటికి పాత అప్పులను కలుపుకుంటే అప్పు మొత్తం దాదాపు 3.5 లక్షల కోట్లకు చేరింది. 
 
దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.  ఇంత పెద్ద అప్పు భారం నుండి రాష్ట్రాన్ని బయటపడేయటం అంటే చాలా కష్టం.  ఎంత కష్టపడినా, ఎన్ని వ్యూహాలు వేసినా ఆ అప్పు తీరాలంటే ఆదాయ వనరులు లేని ఆంధ్రాకు చాలా ఏళ్లే పడుతుంది.  అందుకే నాయకులు ఎవరైనా కొత్త అప్పులు చేయకుండా ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ పాలన చేస్తే బాగుంటుందని ఆర్థిక నిపుణులు అంటూ వచ్చారు.  2019కి టీడీపీ ప్రభుత్వం పోయి వైఎస్ జగన్ సీఎం అయ్యారు.  ఆయనైనా అప్పుల మీద ఆధారపడకుండా పాలన చేస్తారేమోనని ఆశపడితే అది అసాధ్యమని మొదటి యేడాది పాలనలోనే రుజువు చేశారాయన.  అప్పు లేనిదే పూట గడవదు అన్నట్టు పనిచేశారు. 
 
ఎన్నికల హామీలను నెరవేర్చడమే ధ్యేయంగా పెట్టుకుని వేల కోట్లు ప్రజలకు పంచారు.  ఆటో నడిపితే డబ్బు, పిల్లల్ని బడికి పంపితే డబ్బు, జబ్బు చేస్తే డబ్బు, బిడ్డ పుడితే డబ్బు, వయసు మళ్లితే డబ్బు.. అన్ని వర్గాలను కవర్ చేయాలనే ఉద్దేశ్యంతో వివిధ పథకాలు పెట్టి 3.9 కోట్ల మందికి 40,000 కోట్లు పంచేశారు.  అధికార పార్టీ నేతలు ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ దాని వెనుకాల ఉన్న అప్పులను గురించి ఆలోచించట్లేదు.  ఇలా పథకాల అమలుకు, పాలనా వ్యయాలకు, ఇతర ఖర్చులకు రెవెన్యూ ఆదాయం సరిపోక రికార్డ్ స్థాయిలో 60,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చారు.  సరే అప్పులతో సమానంగా ఆదాయ వనరుల సృష్టి ఉందా అంటే లేదు.  పైగా కరోనా కాటు అదనం. 
 
వెరసి మొదటి యేడాది అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు నడిపి ప్రజల చేత భేష్ అనిపించుకున్న జగన్ ఆర్థిక నిపుణులు మాత్రం నొరెళ్లబెట్టేలా చేశారు.  ఆఫ్ బడ్జెట్ అప్పులు 46,000 కోట్లు తేవడంతో 2018 – 19లో జీఎస్డీపీ, అప్పుల నిష్పత్తి 28 శాతంగా ఉంటే 2019-20 లో అది 34.6 శాతానికి పెరిగింది.  ఫలితంగా క్రెడిట్ రేట్ దెబ్బతింది.  ఇలాగే నడుస్తూ పోతే ఇక మీదట అప్పు పుట్టడం కూడా కష్టమే అవుతుంది.  మొదటి యేడాదిలోనే వైసీపీ సర్కార్ 60,000 కోట్లు అప్పు చేసింది అంటే ఇంకో నాలుగేళ్లలో మరో 2.4 లక్షల కోట్లు తెస్తుందా అనే అనుమానం కలుగుతోంది.  అదే గనుక జరిగితే 5 ఏళ్ళలో అప్పులు 3 లక్షల కోట్లు అవుతాయి.  అప్పుడు రాష్ట్రం మొత్తం అప్పు అక్షరాలా 6.5 లక్షల కోట్లకు చేరుతుంది.  
 
మరి వీటికి బాధ్యత ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిన రాజకీయ పార్టీలు, నేతలు తీసుకుంటారా అంటే తీసుకోరు.  ప్రజల నెత్తి మీదే పెడతారు.  ఫలితం పెట్రోల్, డీజిల్, మద్యం, ఆర్టీసీ చార్జీలు, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు నెలకొకసారి పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  పోనీ కేంద్రమైనా ఆదుకుంటుందా అంటే చెప్పలేం.  అన్నీ బాగున్నప్పుడే పన్నుల్లో వాటాలను సమయానికి విడుదల చేయని కేంద్రం అప్పుల్లో ఆదుకుంటుందని అనుకుంటే అత్యాశే అవుతుంది.  అలాంటప్పుడు అప్పులు తేవడం ఆపొచ్చు కదా అంటే నిధుల కోసం ఆస్తులనే అమ్మడానికి సిద్దమైనవారు అప్పులు తేవడానికి వెనుకాడతారని అనుకోలేం.  మరి వైఎస్ జగన్ ఈ ప్రమాదాన్ని గుర్తించి అప్పును అలవాటుగా చేసుకోకుండా రెండో యేడాది పాలనలో అయినా కొత్త అప్పులు తగ్గించుకుంటారేమో చూడాలి.