మస్ట్ రీడ్: దేవుడిపై అలిగిన ఊసరవెల్లి… ఆత్మహత్యాయత్నం!

తాజాగా ఫారెస్ట్ లో ఒక ఊసరవెల్లి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిందని సమాచారం. దేవుడు తనకు మాత్రమే ఈ ప్రత్యేక లక్షణం ఇచ్చాడని, రంగులు మార్చగలిగే శక్తిని ప్రసాదించాడని ఇంతకాలం ఆయనపై ఎంతో భక్తిగా, కృతజ్ఞతగా ఉన్న ఊసరవెల్లి… ఇప్పుడు ఆ దేవుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. తనకంటే ఎక్కువ రంగులు మార్చే వారు ఈ భూమిపై ఉన్నారని.. వారు ఏపీలో కనిపించారని.. ఆయన పేరు చెప్పకుండానే ఊసరవెల్లి ఆత్మహత్యా యత్నం చేసిందంట.

ఆ ఊసరవెల్లి సంగతి అలా ఉంటే… తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడ‌త వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కృష్ణాజిల్లా అవ‌నిగ‌డ్డలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన… వైసీపీ మ‌హ‌మ్మారికి జ‌న‌సేన‌, టీడీపీ సంకేర్ణమే వ్యాక్సిన్ అని అన్నారు. ఈ రెండు పార్టీలతో కలిపిన సంకీర్ణ ప్రభుత్వమే రానున్న రోజుల్లో వ‌స్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో… బీజేపీతో కలిసి వెళ్తే ఓట్లు వస్తాయి.. అయితే ఎంతమందిమి అసెంబ్లీకి వెళ్లగలం? అని ఆయ‌న ప్రశ్నించారు. ఒంటరిగా పోటీచేసినా కచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాం కానీ.. అధికారంలోకి మాత్రం రాలేము అని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే వెళ్తాయి.. వచ్చేవాళ్లు ఎవరైనా ఉంటే రావొచ్చు.. అని పరోక్షంగా బీజేపీకి సూచించారు!

గతంలో… ఎన్డీఏ మిత్ర ప‌క్షాల కూట‌మి స‌మావేశానికి ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత మైకుల ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట‌వుతుంద‌ని సీరియస్ టోన్ లో చెప్పారు. ఇదే ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అంత‌కు ముందు పలుమార్లు జ‌న‌సేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని, అది ఎవరూ ఆపలేరని చెప్పారు. అంతకముందు… పరోక్షంగా టీడీపీతో కలిసిన ఎన్డీయే కూటమి వస్తుందనే కబుర్లు చెప్పారని అంటున్నారు.

ఈ క్రమంలో నాలుగో విడ‌త వారాహి యాత్ర వ‌చ్చేస‌రికి… బీజేపీ మాయ‌మైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ప్రెస్ మీట్ లో ఆశాభావం వ్యక్తం చేసిన పవన్… ఈసారి కట్ చేసి పక్కనపడేసినట్లున్నారు. కేవ‌లం టీడీపీ, జ‌న‌సేన ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. బీజేపీతో క‌లిసి పోటీ చేస్తే ఓట్లు వ‌స్తాయో త‌ప్ప, సీట్లు రావనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఏపీలో బీజేపీ బ‌ల‌మేంటో తెలిసి కూడా ఆ పార్టీతో ఎంతో ముందుగానే పొత్తు ఎందుకు పెట్టుకున్నారో జనాలకు చెప్పని పవన్… ఇప్పుడు అదే బీజేపీని ఎందుకు కరివేపాకులా తీసి పక్కనపడేశారో కూడా జనాలకు చెప్పడం లేదు. సినిమాకి స్క్రిప్ట్ ఉంది, డైరెక్టర్ ఉన్నాడు, నిర్మాత ఉన్నాడు, హీరో ఎలాగూ ఉన్నాడు.. ఇంక జనాలకు చెప్పాల్సిన అవసరం ఏమిటి? అనే పంథాలో పోతున్నట్లున్నారు!

ఇక తాను ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను @ వారాహి యాత్ర, తూరుగోదావరి! ఏదో మా జనసైనికుల ఉత్సాహం కోసం అలా అన్నాను.. సీఎం అవ్వాలంటే దానికి చాలా అనుభవం కావాలి.. నాకు ఇంకా అనుభవం లేదు.. కానీ… వచ్చేది జనసేన ప్రభుత్వమే @ వారాహియాత్ర, పశ్చిమ గోదావరి. ముఖ్యమంత్రి ఇస్తానంటే ఓకే.. కాని దానిపై మోజు లేదు @ వారాహి యాత్ర, కృష్ణాజిల్లా!

వ్యూహాలు నేను పన్నుతాను, ఎవరితో ఎలా కలిసి ప్రయాణించాలనే విషయం తనకు వదిలేయండి.. నన్ను సంకించేవాడు నా వాడు కాదు.. పొత్తులు, రాజకీయాలు, వ్యూహాలు నేను చూసుకుంటాను.. అన్నీ బయటకు చెప్పలేను.. మీరు మాత్రం నమ్మి నా వెనక ఉండండి… @ జనసేన బహిరంగ సభ! టీడీపీ – జనసేన పొత్తు ఉద్దేశ్యం నాకు లేదు.. ఇది కేవలం ప్రజలు కోరుకున్న కూటమి @ మచిలీపట్నం!

పవన్ రాజకీయాల సంగతి కాసేపు పక్కనపెడితే… ఆ ఊసరవెల్లి ఆత్మహత్యాయత్నంపై క్షణాల్లో స్పందించి దేవుడు అడ్డుకున్నాడని అంటున్నారు. అనంతరం ఊసరవెల్లి మానసిక క్షోభనుంచి విముక్తిరాలిని చేయడానికి దేవుడు మరో ఆరు నెలల సమయం కోరినట్లు సమాచారం! అయితే ఆ ఊసరవెల్లి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి మాత్రం సరైన కారణం చెప్పడం లేదని తెలుస్తుంది!