వేసవి వచ్చిందంటే డీహైడ్రేషన్ అనే మాట వెంటనే గుర్తుకు వస్తుంది. కానీ చలికాలంలోనూ అదే ప్రమాదం నిశ్శబ్దంగా శరీరాన్ని వెంటాడుతుందన్న విషయాన్ని చాలా మంది గమనించరు. చల్లని వాతావరణంలో దాహం వేయకపోవడం, చెమట పట్టకపోవడం వల్ల నీరు తాగాల్సిన అవసరం లేదన్న భావన ఏర్పడుతుంది. ఇదే పెద్ద పొరపాటు అవుతోంది. ఈ నిర్లక్ష్యం వల్ల అలసట, తలనొప్పి, చర్మం పొడిబారడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు క్రమంగా మొదలవుతాయి.
చలికాలంలో శరీరం నీటిని కోల్పోతున్నట్టు స్పష్టంగా కనిపించదు. చెమట రాదు.. అయితే హీటర్లు, బ్లోయర్లు, మందపాటి దుస్తులు శరీరంలోని తేమను తెలియకుండా తగ్గిస్తాయి. అదే సమయంలో టీ, కాఫీ వినియోగం పెరగడం వల్ల నీటి లోపం మరింత ఎక్కువవుతుంది. దాహం సంకేతం బలహీనంగా ఉండటంతో అవసరమైన పరిమాణంలో నీరు తాగడం మర్చిపోతారు. ఫలితంగా శరీరం లోపలే అలారం మోగుతున్నా మనకు తెలియదు.
దాహం వచ్చినప్పుడు మాత్రమే నీరు త్రాగడం సరిపోదు. ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం మంచి అలవాటు. రోజంతా కొద్ది కొద్దిగా నీరు తాగేందుకు టైమ్ సెట్ చేసుకోవడం అవసరం. మొబైల్‌లో రిమైండర్ పెట్టుకోవడం కూడా సహాయపడుతుంది. చిన్న చిన్న గుక్కల్లో నీరు తాగడం వల్ల శరీరం చలిలోనూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
చలిలో చల్లటి నీరు ఇబ్బందిగా అనిపిస్తే గోరువెచ్చని పానీయాలను ఎంచుకోవచ్చు. గోరువెచ్చని నీరు, హెర్బల్ టీ, నిమ్మరసం, అల్లం లేదా దాల్చిన చెక్క కషాయం శరీరానికి తేమను అందిస్తాయి. ఇవి కేవలం నీటి లోపాన్ని భర్తీ చేయడమే కాదు, శరీరాన్ని వెచ్చగా ఉంచి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అయితే అధిక చక్కెర జోడించకుండా జాగ్రత్త అవసరం.
నీరు తాగడమే కాకుండా ఆహారం ద్వారా కూడా హైడ్రేషన్ సాధ్యమవుతుంది. సూప్‌లు, గంజి, పెరుగు, కూరగాయల రసాలు, నారింజ, ఆపిల్, జామ వంటి పండ్లు శరీరానికి ద్రవాలతో పాటు పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో సూప్‌లు రుచికరంగా ఉండటంతో పాటు నీటి నష్టాన్ని భర్తీ చేసే ఉత్తమ మార్గంగా నిలుస్తాయి.
పెదవులు పొడిబారడం, చర్మం రఫ్‌గా మారడం, ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, అలసట, తల తిరగడం వంటి లక్షణాలు శరీరం ఇస్తున్న ముందస్తు హెచ్చరికలు. వీటిని విస్మరించకుండా వెంటనే నీరు, ద్రవాల పరిమాణం పెంచాలి. చిన్న శ్రద్ధతోనే చలికాలంలో పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
