కోనసీమలోని పచ్చటి పొలాలతో కళకళలాడే గ్రామాలను గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో (గుడా) కలుపుతారా అంటూ హైకోర్టు నిన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సదరు జీవోను కొట్టేసిందట! పచ్చని పొలాలను కాపాడుకోకపోతే ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుందని, భావితరాలు మనలను క్షమించవు అని గౌరవ న్యాయమూర్తి ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారట ఈ సందర్భంగా. హైకోర్టు మనోవేదనను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే.
పచ్చని పొలాలను, పర్యావరణాన్ని కాపాడాలని హైకోర్టు అభిలషించడంలో ఏమాత్రం తప్పు లేదు. జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఏ జీవోనయినా హైకోర్టు కొట్టేస్తుందని అందరికీ తెలిసిందే. అందులో ఏమాత్రం విశేషం లేదు…మతి పోగొట్టుకోవాల్సిన అగత్యం అంతకన్నా లేదు.
అయితే ఇక్కడ సామాన్యులకు అర్ధం కాని విషయం ఏమిటంటే ఈ పచ్చదనం, ప్రకృతి, పొలాలు, పంటలు అనేవి కేవలం కోనసీమకే వర్తిస్తాయా? లేక అమరావతిలోని పొలాలకు కూడా వర్తిస్తాయా అనేది. అత్యున్నత విద్యావంతుడు, మేధావి అయిన శివరామకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చంద్రబాబు రాజధానిగా ప్రతిపాదించిన ప్రస్తుత అమరావతి ప్రాంతం రాజధాని నగర నిర్మాణానికి ఏమాత్రం పనికిరాదని, మెట్ట ప్రాంతమైన దొనకొండలో నిర్మించాలని, అలాగే అభివృద్ధిని కూడా ఒకేచోట కేంద్రీకృతం చెయ్యకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమభావంతో చూడాలని తన నివేదికలో కుండబద్దలు కొట్టినా, అక్షరం ముక్క రాని పోస్ట్ గ్రాడ్యుయేట్, తెలుగుదేశం పార్టీకి మహారాజపోషకుడు అయిన పొంగూరు నారాయణ గారితో కొందరు నిరక్షరకుక్షులను సభ్యులుగా నియమించి అమరావతిని రాజధాని అనిపించేసారు. అక్కడ ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పొలాలను బలవంతంగా రైతులనుంచి లాగేసుకున్నారు. నలభై వేల ఎకరాల పచ్చని భూములను తమ రియల్ ఎస్టేట్ వ్యాపారదాహం కోసం ప్రకృతి విధ్వంసానికి తెగించారు.
అవన్నీ పచ్చటి పొలాలని, నగర నిర్మాణం కోసం వాటిని నాశనం చేయరాదని, ప్రకృతి సమతుల్యతను దెబ్బతియ్యరాదని ఇదే హైకోర్టుకు ఎందుకు తోచలేదో తెలియడం లేదు. దేశంలో ఏ రాష్ట్రమైనా నగర అవసరాలను బట్టి పరిధులు మార్చుతూ విస్తరించడం సహజాతి సహజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైద్రాబాద్ మునిసిపిల్ కార్పొరేషన్ ను రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సైతం విస్తరించి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ గా మార్చారు. అప్పటివరకు డజను నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన గ్రేటర్ కార్పొరేషన్ నేడు పాతిక నియోజకవర్గాల పరిధికి విస్తరించింది. దాని ఫలితమేమిటో ఈరోజు అందరూ చూస్తున్నారు. వందలాది పరిశ్రమలు, అత్యద్భుతమైన రింగ్ రోడ్, మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి అనేక మౌలిక వసతులు భాగ్యనగరంలో వెలిసి లక్షలమందికి ఉపాధి కల్పించే మహానగరంగా భాసిస్తున్నది. ఈ క్రమంలో కొన్ని భూములు, స్థలాలు, కొన్ని గ్రామాలు కూడా బలైపోతాయి. ఒక సాగునీటి ప్రాజెక్ట్ ను నిర్మించాలన్నా వందలాది గ్రామాలు, పచ్చని పొలాలు మునిగిపోతాయి, మాయమైపోతాయి.
ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పచ్చని పొలాలను నాశనం చెయ్యడం తప్పే అయితే అమరావతిలో రాజధానిని నిర్మించడం కూడా ప్రకృతి విధ్వంసం కిందికే వస్తుంది. కాబట్టి ఈ తీర్పు ఆధారంగా అమరావతిలో రాజధాని కార్యకలాపాలను నిలిపివేసి ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఎలాంటి ప్రకృతి విధ్వంసం జరగని విశాఖకు మార్చడం తక్షణ ఆవశ్యం. అలాగే ఇప్పటి హైకోర్టు కూడా వందల ఎకరాల పచ్చదనాన్ని భస్మీపటలం గావించి నిర్మించిన తాత్కాలిక భవనమే. దాన్ని కూడా నిర్మూలించి ఎవరి పొలాల్లో అయితే ఆ భవనాన్ని నిర్మించారో ఆయా సొంతదారులకు అప్పగించేసి హైకోర్టును కర్నూలుకు తరలించడం ఉత్తమమైన పరిష్కారం.
ప్రస్తుత అమరావతి ప్రాంతంలో 2014 ముందు నాటి పరిస్థితిని తీసుకుని రావడానికి ప్రభుత్వం కృషి చెయ్యాలి. నీరు కావాలంటే పదునైన గునపాన్ని భూమిలో బలంగా దింపాల్సిందే. ఆమ్మో..భూమాతకు నొప్పి పుడుతుందేమో అనుకుంటే మన దాహార్తి తీరుతుందా? ప్రాణాలు నిలుస్తాయా?